Tuesday, November 26, 2024

e – KYC Effect – ఎపి రైతుల‌కు షాక్..

అమరావతి, ఆంధ్రప్రభ :
రైతులకు పెట్టు-బడి సాయం అందించే కేంద్ర పథకం పిఎం కిసాన్‌లో లబ్ధిదారుల కుదింపు ఆగట్లేదు. ఈ నెల 27న జమ అయిన కిస్తీకి ఇ-కెవైసి ప్రతిబంధకంగా మారింది. మిగతా అవాంతరా లన్నీ దాటు-కొని అర్హత సాధించిన రైతుల్లో ఇ-కెవైసి చేయించని కారణంగా 5.34 లక్షల మంది పిఎం కిసాన్‌ సాయానికి దూరమయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు కేంద్రం ఇచ్చే రూ. 2 వేల సాయం అందకుండా పోతోంది. ఏడాదిలో మూడు కిస్తీల్లో మొత్తం రూ.ఆరు వేలను పిఎం కిసాన్‌ పేరిట నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు కేంద్రం నగదు బదిలీ చేస్తోంది. స్వంత భూమి కలిగిన వారికే ఈ సాయం అందిస్తోంది. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జులై మొదటి కిస్తు ఈ నెలాఖరులోపు వేసేందుకు కసరత్తు సాగుతోంది. ఎపిలో 45,41,177 మంది రైతులు పథకానికి ఎంపికయ్యా రు. తప్పనిసరిగా ఇ-కెవైసి చేయించుకుంటేనే వీరికి పిఎం కిసాన్‌ కిస్తీ పడుతుందని కేంద్రం నిబంధన పెట్టింది. జులై నెలాఖరు సమీపిస్తున్నా ఇ-కెవైసి పూర్తి కాలేదు. 40,06,553 మందికి (88 శాతం) మాత్రమే ఇ-కెవైసి జరిగింది. ఇంకా 5,34,624 మందికి (12 శాతం) ఇ-కెవైసి పూర్తి కాలేదు. కిస్తు పడే నాటికి ఇ-కెవైసి జరగకపోతే ఆ రైతుల ఖాతాల్లో కేంద్రం నుంచి కిస్తు పడదు.

అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38,737 మంది రైతులకు ఇ-కెవైసి కాలేదు. అత్యల్పంగా విశాఖపట్నంలో 3,906 మందికి ఇ-కెవైసి కాలేదు. 2019 ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ పథకానికి లబ్ధిదారులు క్రమేపి తగ్గిపోతున్నట్లు- గణాంకాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో 60,80,161 మంది రైతులు పిఎం కిసాన్‌ సాయానికి అర్హులుగా ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి కిస్తు (ఏప్రిల్‌- జులై) 46,62,768 మందికి జమ అయింది. వివిధ కారణాలతో 14 లక్షల మందికి సాయం అందలేదు. అదే ఏడాది రెండవ కిస్తు (ఆగస్టు-నవంబర్‌) 52,18,734 మందికి పడింది. అర్హుల్లో సుమారు 8 లక్షల మందికి సాయం జమ కాలేదు. 2022-23 చివరి కిస్తు (డిసెంబర్‌-మార్చి) నుంచి ఇ-కెవైసి నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు.

దాంతో లబ్ధిదారుల సంఖ్య 48,91,293కు దిగజారింది. త్వరలో వేస్తారంటు-న్న ఈ ఆర్థిక సంవత్సరంలో తొలికిస్తు (ఏప్రిల్‌-జులై) 40,06,553 మందికే పడుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నా యి. ఇ-కెవైసి పెండింగ్‌ వలన 5.34 లక్షలు, ఇతరత్రా కారణాల వలన 15 లక్షలు వెరసి అర్హులైన రైతుల్లో 20 లక్షల మందికి పిఎం కిసాన్‌ సాయం దక్కలేదు. రైతులకు పెట్టు-బడి సాయం అందించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని కేంద్ర స్కీం పిఎం కిసాన్‌తో అనుసంధానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదికి రూ.13,500 మూడు విడతల్లో ఇస్తామనగా వాటిలో కేంద్రం వాటా రూ.6 వేలు. కేంద్ర నిబంధనల వలన లక్షల మందికి పిఎం కిసాన్‌ అందట్లేదు. రాష్ట్రం ఇచ్చే 7,500 మాత్రమే పడుతోంది. ఈ ఏడాది భరోసా తొలి కిస్తీ రూ. 5,500 జూన్‌ 1న రాష్ట్ర ప్రభుత్వం 52.30 లక్షల మందికి విడుదల చేసింది. ఇ-కెవైసి నిబంధన వలన కేంద్రం వాటా పిఎం కిసాన్‌ 40.06 లక్షల మందికే పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement