అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటకే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉపలయాలు సైతం శరన్నవరాత్రి శోభను సంతరించుకున్నాయి.
ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 15లక్షల మంది వరకు భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరీ దేవిగా సాక్షాత్కరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తొలి రోజు ఉదయం 9గంటలకు శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం ప్రారంభమై రాత్రి 10గంటల వరకు కొనసాగుతుంది. మిగిలిన రోజుల్లో ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఉంటుంది. శ్రీఅమ్మవారి భక్తుల కోసం కనకదుర్గానగర్‌లో 15 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 20లక్షల లడ్డూ ప్రసాదాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గాఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 750 షవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సీతమ్మవారి పాదాల సమీపంలో కేశఖండన శాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదులు నిర్మించారు. ఒక్కొక్క షిప్టులో 250 మందిని కేశఖండన శాలలో నియమంచారు. భక్తుల అత్యవసరాల కోసం 150 మొబైల్ టాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక క్యూ మార్గాలు..
శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొండ దిగువన కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి, కుమ్మరి పాలెం సెంటర్ నుంచి మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీరు కొండ పైభాగానికి వెళ్లిన తర్వాత ఓమ్ టర్నింగ్ పాయింట్ వద్ద ఐదు క్యూలైన్లు చేశారు.
ఇందులో ఒకటి వీఐపీల కోసం అధికారులు కేటాయించారు. క్యూలైన్లలో భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం గుండా కొండ దిగువకు వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ మండప దర్శనమే..
వీవీఐపీ ప్రొటోకాల్ ఉన్న వారికి మినహా ప్రత్యేక ప్రవేశన టిక్కెట్లు కలిగిన భక్తులకు ముఖ మండప దర్శనం మాత్రమే ఉంటుంది. వీవీఐపీలకు మాత్రం అంతరాలయ దర్శనం కలిపించనున్నారు. వీవీఐపీలు సైతం ముందస్తు సమాచారం ఇచ్చి రావాల్సి ఉంటుంది. వివిధ సేవల కోసం వచ్చే భక్తుల వాహనాలు, వీవీఐపీల వాహనాలు కొండ పైభాగంలోని ఓం టర్నింగ్ వద్దకు మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు వాహనాలకు ఏ విధమైన అనుమతి లేదని అధికారులు తెలిపారు.
అలంకారాలు..
15న శ్రీ బాలా త్రిపురసుందరి దేవి, 16న శ్రీ గాయత్రీ దేవి, 17న శ్రీ అన్నపూర్ణాదేవి, 18న శ్రీ మహాలక్ష్మీ దేవి, 19న శ్రీ మహా చండీ దేవి, 20న శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం), 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 22న శ్రీ దుర్గాదేవీ(దుర్గాష్టమి), 23న శ్రీ మహిషాసుర మర్థనీ దేవి(మహర్నవమి)గా మధ్యాహ్నం వరకు దర్శనమిస్తారు. తిరిగి మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా రాత్రి 11గంటల వరకు శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 5గంటల నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నదీ విహారం(తెప్పోత్సవాన్ని) నిర్వహిస్తారు.