Monday, November 25, 2024

ఇంద్రకీలాద్రిపై 26 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి నిర్థేశించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవదాయశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌, జాయింట్‌ కమిషనర్‌(ఎస్టేట్స్‌) చంద్రశేఖర్‌ అజాద్‌, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు కేవీఎస్‌ కోటేశ్వరరావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వహణాధికారి బీ.వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి మూడు బంగారు కిరీటాలు..

నవీ ముంబైలోని రెకాన్‌ మెరైన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన జీ.హరికృష్ణారెడ్డి దంపతులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాల అలంకరణకు 1308 గ్రాముల బరువైన మూడు బంగారు కిరీటాలు బహుకరించారు. సోమవారం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కార్యనిర్వహణాధికారి డీ.భ్రమరాంబను కలిసి కిరీటాలు సమర్పించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మవారి దర్శనం కలిపించగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో భ్రమరాంబ దాతలకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement