విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్ కు పరివేష్టం చుట్టారు అర్చకులు. క నకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదో ఏడాది సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం జగన్ కు తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. సీఎం ను వేద పండితులు ఆశీర్వదించారు.
కాగా, శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.