కర్నూల్ బ్యూరో (ఆంధ్రప్రభ) : ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, డీఎస్సీ పరీక్షను ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు బిర్లా గేట్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ… మొదటి సంతకం మొదటికే మోసం వస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంటికి పరిమితం కావాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందన్నారు. డిసెంబర్ నాటికి డీఎస్సీ పరీక్షను పూర్తి చేసి ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏదో ఒక కారణం చెప్పి మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు కావాల్సిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చివరిలోనే కులగణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అందులో ఎవరు ఏ కులం, ఎంతమంది నిరుద్యోగులు, ఏం పని చేస్తున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు అన్ని వివరాలు సేకరించారని తెలిపారు.
మిశ్రా కమిషన్ ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని, కమిషన్ నివేదిక ఇవ్వడానికి మల్లో పది నెలలు పడుతుందనేలాగా ఉన్నారని తెలిపారు. కావున తెలంగాణ ప్రభుత్వం మాదిరి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయాలని, జిల్లా అంతటా ఒకటే పేపర్ ఉంటేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా, అబ్దుల్లా, కర్నూలు మండల అధ్యక్షులు సురేష్, నగర ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, నాయకులు ఖాజా నిరుద్యోగులు ఉమర్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేష్ నాయక్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.