అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షాదారంపై మాత్రమే అధారపడుతూ వ్యవసాయం చేసుకునే భూములు మరియు ఏ వనరులు లేక బీడుగా ఉండిపోయిన సుమారు 6 లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వాటర్ షెడ్‌ల నిర్మాణం ద్వారా కొత్తగా సాగులోకి తీసుకురాబోతుంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 59 మండలాల పరిధిలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అక్కడే నిల్వ ఉంచేలా వాటర్ షెడ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రాజెక్ట్ ఖర్చును 60-40 నిష్పత్తిలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే మొత్తం 266 గ్రామ పంచాయితీల పరిధిలోని దాదాపు 5 లక్షల రైతు కుటు-ంబాలకు సంబంధించిన 6,03,938 ఎకరాలకు (2,44,405 హెక్టార్లు) సాగునీటి వసతి మెరుగుపడుతుంది. అంతేకాక ఆయా గ్రామాల్లో మరో రెండు లక్షల వరకూ రైతు కూలీ కుటుంబాలకు ఆదాయమార్గాలు పెరిగేలా వివిధ రకాల జీవనోపాధుల కల్పనకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా అందించనుంది.
వినూత్నంగా నిర్మాణం..
వాటర్ షెడ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వినూత్న ఫలితాల సాధనే ధ్యేయంగా చేపట్టబోతుంది. వాటి నిర్మాణ సమయంలోనే ఆయా గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం మేరకు బీడు, బంజరు భూములకు సాగునీటి వసతి మెరుగుపడుతుందా లేదా అన్నది పరిశీలన, సమీక్షలు చేసుకుంటూ రెండు నుంచి ఐదేళ్ళ మధ్య కాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చెపట్టాలన్నది అంచనా వేశారు. అలాగే సమగ్ర ప్రణాళిక (డీపీఆర్)లు కూడా అధికారులు సిద్ధం చేసి, భూవనరుల విభాగం న్యూడిల్లీ కి పంపారు.
కేంద్ర అధికారులతో సమీక్ష..
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే భూ వనరుల విభాగం అదనపు కార్యదర్శి హుకుం సింగ్ మీనా సోమవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో WWDC.PMKSY.2 పై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఆదివారం ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా 13 జిల్లాల పరిధిలోని 59 మండలాల్లో అమలవుతున్న రూ. 555.31 కోట్ల విలువైన వాటర్ షెడ్ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, కేంద్ర భూవనరుల విభాగం సీనియర్ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, వాటర్ షెడ్ సంచాలకులు డా. పి.వి.ఆర్.ఎం. రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.