విశాఖపట్నం , ప్రభన్యూస్ బ్యూరో : విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇప్పటికే పలు సందర్భాల్లో డ్రగ్స్ విక్రయాలు చేపడుతూ అనేకమంది పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తాజాగా స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో విక్రయించేందుకు గోవా నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకువచ్చారు. అయితే విశాఖ పోలీసులు నగర కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు చాకచక్యంగా వ్యవహరించి, డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసి, ఐదుగురిని అరెస్టు చేశారు.
ఇందుకు సంబంధించి వివరాలను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం పాత్రికేయులకు వెల్లడించారు. గతంలో హోలీపండుగ సమయంలో విశాఖకు ఈ ముఠా డ్రగ్స్ విశాఖ తీసుకువచ్చారు. అయితే ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా గోవా నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకువచ్చారని, వీటిని ఇక్కడ విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. ఈ నేపధ్యంలోనే డ్రగ్స్ విక్రయిస్తున్న రవికుమార్, వాసుదేవ, కాటయ్య, మోజేష్, యాడ కిషోర్, మర్రె సందీప్‌ను అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి 50ఎల్ఎస్డి బ్లాట్స్, 4.4 గ్రాముల ఎండిఎంఏ పౌడర్ , 5 సెల్ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వివరించారు.
గంజాయి ఇచ్చి… డ్రగ్స్ తీసుకుని
అయితే , ఈ కేసులో 6వ నిందితుడు దిలీప్ అనే వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఏ-1 పాంగిరవికుమార్ ఇక్కడ నుంచి గంజాయి తీసుకొని వెళ్లి గోవాలో దిలీప్‌కి అందజేసేవాడన్నారు. తిరిగి దిలీప్ రవికుమార్‌కు డ్రగ్స్ ఇవ్వడం జరిగేదన్నారు. వాటిని ఇక్కడకు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతారని కమిషనర్ తెలిపారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకొని డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటి కొనుగోలుకు క్రిస్టో కరెన్సీ, యూపిఐల ద్వారా పేమెంట్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యాపారమంతా ఆన్లైన్ ద్వారానే సాగుతున్న దన్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న, అలవాటున్న అందరిపైన యాంటీ నార్కోటిక్ సెల్ ద్వారా నిఘా ఉంచినట్లు సీపి వివ రించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.