Friday, November 22, 2024

AP: గుంటూరులో డ్రగ్స్ సీజ్…

  • ప్రైవేటు బస్సులో 65 గ్రాములు స్వాధీనం
  • మూలాలు ఛేదించేందుకు బెంగళూరుకు ప్రత్యేక బృందాలు


ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి గుంటూరు బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారబోతుందా. ఈ ఏడాదిలో గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ పట్టుబట్టడం ఇది మూడోసారి. గతంలో నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 22 గ్రాములు ఒకసారి, 20 గ్రాములు మరోసారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కొద్ది నెలల కిందట హైదరాబాద్ డ్రగ్ మాఫియా తో సంబంధం ఉన్న మస్తాన్ దర్గా నిర్వాహకుని తనయుడు సాయిని ప్రత్యేక పోలీసు లు అరెస్ట్ చేశారు. కాగా తాజాగా బెంగళూరు నుంచి గుంటూరు వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు వ్యక్తుల వద్ద 65 గ్రాముల మాదకద్రవ్యాలు దొరకటం సంచలనం రేపింది. గుంటూరు నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు…
డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన షరీఫ్, రోనాల్డ్ అనే వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మూలాలను ఛేదించేందుకు రెండు బృందాలను బెంగళూరుకు పంపినట్లు తెలిసింది. డ్రగ్స్ కలకలం రేపడంతో ఒక్కసారిగా గుంటూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతి గుంటూరు నగరాన్ని ఆవహించడంతో బెంబేలెత్తిపోతున్నారు.

- Advertisement -

దొరికిన డ్రగ్స్ విలువ కోట్లలో ..
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక గ్రాము విలువ లక్షల్లో ఉంటుందని పట్టుబడిన డ్రగ్స్ 65 గ్రాములు ఉండటంతో విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కొద్ది నెలల కిందట డ్రగ్ కేసులో పట్టుబడిన సాయికి ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement