కర్నూలు, ప్రభన్యూస్ : ఓవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు కరెంటు కోతలు తోడవ్వడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇంట్లో ఉండోలేక.. బయటికి రాలేక సతమతమవుతున్నారు. రాత్రి పూట సైతం పవర్ కట్ ఉండటంతో నిద్ర కరువవుతున్నది. జనరేటర్, ఇన్వర్టర్, టార్చిలైట్ వెలుతురులో గడపాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. విద్యుత్ కోత కారణంగా ఇక హాస్పటల్స్‌లో ఆపరేషన్లు వాయిదా వేయాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయంటే జిల్లాలో పవర్కోత ఏ మేరకు ఉందో గ్రహించవచ్చు. ఇక పల్లె కేంద్రాల్లో అయితే చెప్పనవసరం లేదు. అనధికార కోతలతో పల్లె ప్రజల ఇక్కట్లు అంతా ఇంతకావు. ఈ కరెంటు కష్టాలకు కారణమేంటి అని పరిశీలిస్తే.. వాస్తవంగా మనకి రాష్ట్రంలో ధర్మల్, విండ్, సోలార్ పవర్స్ ద్వారా సెంట్రల్ గ్రిడ్స్‌కు విద్యుత్ అందుతుంది. అక్కడి నుంచి మనకు సరఫరా చేస్తారు. అయితే వేసవి కావడంతో విద్యుత్ వినియోగం అధికమైంది. దీంతో డైలీ షార్టేజ్ వస్తున్న విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తామన్న షార్టేజ్ వస్తుందన్నది ప్రభుత్వమాట. దీంతో విద్యుత్ కోతలు విధించకతప్పలేదంటున్నారు. దీంతో అటు పల్లెల్లో, ఇటు చిన్న పట్టణాల్లో విద్యుత్ కోతల మూలంగా చీకట్లు అలుముకొనున్నాయి. వ్యవసాయంకు కోతలు తప్పేలా లేవు. దీంతో రైతులు డీజిల్ వినియోగంపై ఆధారపడక తప్పేలా లేదు. వాస్తవంగా గత రెండేళ్లలో కరోనా కారణంగా పరిశ్రమలు సక్రమంగా పనిచేయకపోవడం, ఇతర సంస్ధలు, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు లేకపోవడంతో విద్యుత్ వాడకం తక్కువగా ఉండేది. కానీ వ్యవసాయం ఎక్కువ కావడం, ప్రస్త్తుత మార్చి, ఏప్రిల్ నెలలో గతంలో కంటే విద్యుత్ వినియోగం పెరడంతో కోతలు తప్పలేదంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో గృహఅవసరం విద్యుత్ కనెక్షన్లు 11,70,853 వరకు ఉన్నాయి. వీటిద్వారా ప్రతినెల 98 నుంచి 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి సంబందించి 1.99 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు వాణిజ్య సర్వీసులు 1,27,468 వరకు ఉన్నాయి. ఇక పరిశ్రమలకు సంబందించి 9914 పైగా సర్వీసులున్నాయి. ఇందులో హెచ్‌టి 648 వరకు ఉన్నాయి. ఇక వీటికి సంబందించి ప్రతిరోజు కోటీ 60 లక్షల విద్యుత్ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఇందులో 40 శాతం వ్యవసాయంకే వినియోగిస్తుండటం గమనార్హం. ఇందులో చిరు, పెద్ద పరిశ్రమలకు రోజుకు 156 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. శనివారం రోజు 11.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారుల లెక్కలను బట్టి వెల్లడవుతుంది. విద్యుత్ వినియోగం పెరగడం మూలంగా కోతలు విధించక తప్పదంటున్నారు. ఈ నెల ఆఖరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటుని అంచనా వేస్తున్నారు.
పరిశ్రమలకు పవర్ హాలిడే..
జిల్లాలో విద్యుత్ వినియోగం పెరగడంతో ఆశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పవర్ హాలిడే ప్రకటించారు. ఇప్పటికే ఉన్న వీక్లి హాలిడేకు ఆదనంగా మరో రోజు కోత విధించింది. విద్యుత్ వాడకం పెరగడంతోనే ఈ నిర్ణయం అంటుంది. గృహా వ్యవసాయ అవసరాలకు కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ లేకుండా చేసేందుకు హెచ్‌టి సర్వీసులు కలిగిన పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇందులో నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు విద్యుత్‌శాఖ నుంచి అనుమతి తీసుకున్న లోడ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఐదు రోజుల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ దీపాలు వెలిగించడానికి మాత్రమే విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి తీసుకున్న లోడ్‌ను పూర్తిగా వినియోగించాల్సి ఉంటుంది. వీటిద్వార మిగులు విద్యుత్ గృహా వినియోగదారులకు, వ్యవసాయ అవసరాలకు కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో బొగ్గు కోరత వల్ల వచ్చిన సంక్షోభం, వేసవి దృష్ట్యా పెరిగిన వాడకానికి సరిపడ విద్యుత్ సరఫరా లేకపోవడం, ఎమరెన్సీ లోడ్ రిలీఫ్ అనివార్యమైం దన్నది అధికారుల వాదన. వీటిద్వార ప్రస్తుతం జిల్లాలో వినియోగిస్తున్న విద్యుత్‌లో 70 నుంచి 80 మెగావాట్లు తగ్గించాలన్నది అధికారుల నిర్ణయం.
వ్యవసాయంపై తీవ్ర ప్రభావం…
విద్యుత్ కోతలకు జిల్లాలోని వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పల్లేలో గంటపాటు కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో బోర్లు, బావులు, చెరువులు, కుంటల కింద పంటలను సాగు చేశారు. వీటిలో చాల వరకు చివరి దశలో ఉన్నాయి. ముఖ్యంగా మినుము పంటకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటితో పాటు ఎల్ఎల్సి కింద కూడ పంటలు సాగు చేశారు. వీటిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఎల్ఎల్సి కింద వరికి నష్టం కలగనుంది. విద్యుత్ కోతల మూలంగా డిజిల్ వినియోగం తప్పని సరిగా మారనుంది. దీంతో రైతుపై ఆదనపు బారం పడనుంది. ఇక జిల్లాలోని మంచినీటి పథకాల సరఫరాకు అటంకంగా మారనుంది. ఇప్పటికే పల్లేలో మంచినీటి ఇబ్బందులతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. విద్యుత్ కోతలతో మరింత భారం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..