Friday, November 22, 2024

డ్రోన్లు వచ్చేస్తున్నాయ్.. భారీగా తగ్గనున్న వ్యవసాయ ఖర్చులు..

అమరావతి, ఆంధ్రప్రభ : డ్రోన్ల వినియోగం ద్వారా వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పొగాకు బోర్డు చైర్మన్‌, బీజేపీ సీనియర్‌ నేత యడ్లపాటి రఘునాధ్‌ బాబు తెలిపారు. గుంటూరులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌ మహోత్సవం 2022 పేరుతో డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా-కేంద్ర పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ఈనెల 27, 28న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహించిన డ్రోన్ల ఎగ్జిబిషన్‌ లో తాను పాల్గొన్నాననీ, 75 కంపెనీలు డ్రోన్ల వినియోగం పరిజ్ఞానంపై స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రెండు వేల మందికి పైగా పాల్గొన్న సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. డ్రోన్ల వినియోగ నిబంధనలు సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్టు-బడి వ్యయ భారాన్ని తగ్గించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయనీ..స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారు చేయటంతో పాటు తక్షణ వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా కలుపు, పిచికారి పనులు చేపట్టగా వ్యయం 25 శాతం తగ్గిపోవటమే కాకుండా ఎంతో సమయం ఆదా అయిందని తెలిపారు. అతి త్వరలోనే ఏపీలో డ్రోన్ల వినియోగానికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మరు..

ప్రజల నమ్మకాన్ని చంద్రబాబునాయుడు ఎప్పుడో కోల్పోయారని రఘునాధ్‌ బాబు అన్నారు. మహానాడు లాంటి సభలు ఎన్ని పెట్టినా ప్రయోజనం లేదన్నారు. తన కుమారుడిని ప్రమోట్‌ చేసుకోవటానికే బాబు ప్రాధాన్యతిస్తున్నాడు..సీనియర్లు రిటైర్‌ అవ్వాలని లోకేష్‌ అంటున్నారు..ముందుగా రిటైర్‌ కావాల్సింది చంద్రబాబేనన్న సంగతి అందరూ గుర్తెరగాలన్నారు. కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదించింది టీడీపీనే.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై తమ విధానమేమిటో మహానాడులో ఉద్దేశ్యపూర్వకంగా దాటవేశారు.. వైసీపీ బస్సు యాత్ర విఫలమైంది.. రాష్ట్రంలో లోపాయికారీ రాజకీయాలు చేస్తున్నారు.. 2024 ఎన్నికల్లో బిజేపీ జనసేన కూటమి విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టటం తధ్యమని రఘునాధ్‌ బాబు అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచమల్లు భాస్కర్‌, బిజెపి రాష్ట్ర రైతు నాయకుడు వై.వి సుబ్బారావు, రాష్ట్ర మీడియా కో కన్వీనర్‌ వెలగలేటి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement