Friday, November 22, 2024

AP : శ్రీకాళహస్తీశ్వరాలయంపై డ్రోన్… వీడియోల చిత్రీకరణ…

శివరాత్రి సమీపిస్తోన్న వేళ.. శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్‌ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ముక్కంటి ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ.. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసినవారు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్‌, అజిత్‌ కన్నన్‌, శంకర్‌ శర్మ, అరవింద్‌, పోర్చే జీఎన్‌.. మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత శనివారం రాత్రి శ్రీకాళహస్తికి చేరుకున్నారు.. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌‌హౌస్‌లో దిగిపోయిన భక్తులు.. ఆ తర్వాత డ్రోన్‌ ఎగరవేశారు.

- Advertisement -

అయితే, శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఆలయ పరిసరాలకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.. ఇక, వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించినట్టుగా తెలుస్తుండగా.. తాము దిగిన గెస్ట్‌హౌస్‌ పైనుంచి డ్రోన్‌ కెమెరాతో అర్ధరాత్రి సమయంలో.. ప్రధాన ఆలయంపైకి డ్రోన్ ఎగరవేశారు.. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత డ్రోన్‌ను వెంబడించి యువకులను పట్టుకున్నారు. కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో డ్రోన్‌ కెమెరాల వినియోగంపై ఆంక్షలు ఉన్నా.. పలు సార్లు డ్రోన్‌లు ఎగరవేస్తూ పోలీసులకు చిక్కిన సందర్భాలు లేకపోలేదు.. కొన్నిసార్లు సెక్యూరిటీ వైఫల్యంపై కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement