అమరావతి, ఆంధ్రప్రభ:
దేశంలోనే తొలిసారి గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రహసనంగా మారుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, మసకబారిన మ్యాప్ లు, కానరాని గట్లు.. ఒకే సర్వేనెంబరుతో హక్కు పత్రాలు వెరసి క్షేత్రస్థాయిలో వివాదాలకు దారితీస్తోంది. వేలాది గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నా గ్రామాలు, పట్టణాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు సిబ్బందికి ప్రభుత్వపరంగా వివిధ విభాగా లకు సంబంధించి పనిఒత్తిడి ఎదురు కావటంతో రీ సర్వే ప్రక్రియ నీరుగారుతోందనే విమర్శలు చోటు చేసుకుం టున్నాయి. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకులు, సర్వే సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సైతం రీ సర్వే
కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. జగనన్న భూ రక్ష.. శాశ్వత భూ హక్కు కింద రీ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 1000 కోట్లు కేటాయించింది. సర్వే ఆఫ్ ఇండియా సౌజన్యంతో రాష్ట్రంలో సర్వే సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయపరచి సింగిల్‌విండో విధానం ద్వారా అప్పటికప్పుడు హక్కు పత్రాలు జారీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ల క్ష్యాలను పూర్తి చేయాలని నిర్దేశించింది.
రీ సర్వే… భారీ ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 10,185 మంది సర్వేయర్లను నియమించి 75 అంంశాల్లో శిక్షణ కూడా ఇచ్చింది. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మండల మొబైల్ మేజిస్ట్రేట్ పోస్టులు కూడా మంజూరు చేసింది. రీ సర్వే ద్వారా వచ్చిన అభ్యంతరాలు, వినతులు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా యంత్రాంగాన్ని జాగృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17,461 గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులకు 2.47 కోట్ల సర్వే నెం బర్లలో 2.26 కోట్ ఎకరాల వ్యవసాయ భూముల్లో రీ సర్వేకు ఆదేశించింది. దీంతో పాటు 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 70 కోర్స్ (కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్) బేస్‌లు ఏర్పాటు చేయటంతో పాటు సర్వే సిబ్బందికి 1220 ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మరో 3300 రోవర్లు కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని జిల్లాల్లో డాటా ప్రాసెసింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది. అత్యాధునిక పద్ధతుల్లో సర్వేకు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 30 హై ఎండ్ డ్రోన్లు, 1780 జీఎన్‌ఎన్‌ఎస్ రోవర్లు వినియోగంలో ఉన్నాయి. ఇప్పటి వరకు 11,200 గ్రామాల్లో 96వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 81 శాతం డ్రోన్ ఫ్లయింగ్ జరిగినట్లు చెబుతున్నారు.
మొత్తం 2260 గ్రామాల్లో 22వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జూన్ నాటికి డ్రోన్, ఏరియల్ ఫ్లై పూర్తి కావాల్సి ఉంది. రెండోవిడత 2వేల గ్రామాల్లో భూములకు సంబంధించి 7,86,145 రైతుల ఖాతాలకు 6,86,538 హక్కుపత్రాలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. తొలి దశ రీ సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో 43 లక్షల పట్టా సబ్ డివిజన్లు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో రెండు లక్షల వరకు మ్యుటేషన్లు జరిగాయని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు అధికారులే గుసగుసలాడుతున్నారు. సర్వేలో భాగంగా 2797 గ్రామ రెవెన్యూ అధికారులు, 7033 పంచాయతీ కార్యదర్శులు, 3,664 వార్డు ప్రణాళిక కార్యదర్శులను నియమించారు. వీరితో పాటు సర్వే సిబ్బంది వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీలు సమన్వయంతో పనిచేస్తే రీ సర్వే నిర్విఘ్నంగా కొనసాగేదనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.. రీ సర్వేలో ముందుగా ఫాం 20 కింద నోటీసులు జారీచేసి గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహిస్తారు. ఆతరువాత డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ అనంతరం సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు, డిజిటల్, ప్లానింగ్ సెక్రటరీలు, వలంటీర్లు అంతా క్షేత్ర స్థాయిలో రైతుల అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది.
ఇవీ సమస్యలు
అయితే డ్రోన్ ఫ్లయింగ్ జరిగాక సర్వేకు సంబంధించిన మ్యాపింగ్‌లో అసలు భూములు గుర్తుపట్టే పరిస్థితులు లేవని చెబుతున్నారు. రైతులకు ఫాం 20 నోటీసులిచ్చే బాధ్యతను వీఆర్‌ఏలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీఆర్‌ఏలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలు జగనన్న సురక్ష కింద సర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాల అమలు తదితర పనుల్లో తలమునకలై ఉన్నారు. గ్రామ, వార్డు కార్యదర్శులకు అధికారులు టార్గెట్లు నిర్దేశిస్తున్నారు. దీంతో రీ సర్వేకు వీరు దూరంగా ఉంటున్నారు. వీఆర్‌ఏలు కూడా సాధారణ రెవెన్యూ విధులతో పాటు సురక్ష కార్యక్రమం, సీసీఆర్‌సీ కార్డులకు (కౌలురైతులకిచ్చే కార్డులు), నీటి తీరువాలో టార్గెట్లతో పాటు బూత్ లెవల్ అధికారిగా ఎన్నికల ఓటరు జాబితా సవరణ విధులకు హాజరవుతున్నారు. ఓ రకంగా రీ సర్వే పేరెత్తితే వీరు ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
గ్రౌండ్ ట్రూతింగ్ , డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యాక రైతులను సమావేశపరచాలి. అయితే గ్రామాల్లో రైతులంతా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఓఆర్‌ఆర్ మ్యాపింగ్ తరువాత లాగిన్ ద్వారా వచ్చే సర్వే నెంబర్లను పరిశీలించి అవసరమైతే మ్యుటేషన్లు, కరె క్షన్లు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చల్తా నెంబర్ కేటాయిస్తారు. గతంలో ఓ సర్వే నెంబరు పరిధిలో ఉన్న సబ్ సర్వే నెంబర్లు కలిగిన భూముల యజమానులకు కూడా చల్తా నెంబర్‌లోనే హక్కుపత్రం కేటాయిస్తారు. దీంతో తిరిగి హద్దుల వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ అనంతరం ఫాం 19 నోటీసులు అందించే విషయంలో కూడా అవసరమైన సదుపాయాలు లేక సర్వే, గ్రామ రెవెన్యూ సహాయక సిబ్బంది అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇబ్బందులపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటంతో రీ సర్వే కథ మొదటికొచ్చే పరిస్థితి లేకపోలేదు. వీఆర్‌ఏలు, సర్వే సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అదనపు పనిభారాన్ని తగ్గించి రీ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దేశంలోనే తొలిసారిగా చేపట్టిన కార్యక్రమానికి సార్థకత.