కర్నూలు బ్యూరో : భారత్ గ్యాస్ ఎల్పీజీ టెరిటరీ గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్, బాలసాయి కంటి ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు, ఇతర కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిర ప్రారంభ కార్యక్రమంలో భారత్ గ్యాస్ ఎల్పీజీ టెరిటరీ ప్లాంట్ మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ… కంటి పనితీరును మెరుగు పరిచే పోషకాహారం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.
కంటి వైద్య నిపుణులు లయన్ డా. జయప్రకాష్ మాట్లాడుతూ… నేటి డిజిటల్ కాలంలో కంప్యూటర్, మొబైల్ తో పాటు ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు ఎక్కువయ్యాయని, డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు మొబైల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. శారీరక వ్యాయామంతో పాటు కంటి వ్యాయామం కూడా చేయడం వల్ల కంటి రక్తనాళాలు యాక్టివ్ రక్త ప్రసరణ బాగా జరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
లయన్స్ మాజీ అడిషనల్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనాల రద్దీ ఎక్కువ కావడం వల్ల అధిక కాలుష్యంతో తరచూ కళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.నాగరాజు మాట్లాడుతూ.. వాహనదారులు టీ, కాఫీ, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. భారత్ గ్యాస్ రీజినల్ ఫిల్లింగ్ నేషనల్ స్టేషన్ ఆపరేషన్స్ మేనేజర్ లతీఫ్ మాట్లాడుతూ.. ఖాళీ సమయంలో తగినంత విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వైద్య శిబిరంలో 100 మందికి పైగా వాహన డ్రైవర్లు, ఇతర సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు.