కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రబీ (2024-25) పంటలకు నీటి విడుదలకు సంబంధించిన నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు బాగా పడ్డాయని, అందువల్ల తాగు నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు. గ్రామాల్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, సిపిడబ్ల్యూఎస్ పథకం కింద ఫిల్టర్ బెడ్స్, ఓ అండ్ ఎమ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి అధికారులను ఆరా తీశారు. కొన్ని చోట్ల ఫిల్టర్ బెడ్స్, ఓ అండ్ ఎమ్ సమస్యలు గుర్తించడం జరిగిందని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల వివరాలను తనకు అందించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చోరీ కేసులపై మంత్రి అధికారులను ఆరా తీశారు. రూ.2.6 కోట్ల విలువ చేసే ఆయిల్, కాపర్ చోరీ జరిగిందని, మోటార్లు రన్నింగ్ కండిషన్ లోకి తీసుకొని వచ్చేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు వివరించారు.
సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జలవనరుల శాఖ ఎస్ ఈ బాలచంద్రా రెడ్డి, హంద్రీ నీవా ఎస్ ఈ రామ గోపాల్, కే సీ కాలువ ఈ ఈ ప్రతాప్, తుంగభద్ర దిగువ కాలువ ఈ ఈ శైలేశ్వర్, ఆర్ డి ఎస్ ఈ ఈ భాస్కర్ రెడ్డి, చిన్న నీటి పారుదల ఈ ఈ శ్రీనివాసులు, 68 చెరువుల డి ఈ రామకృష్ణ, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.