అమరావతి, ఆంద్రప్రభ: తెలుగుగంగ నుంచి చెన్నైకి నీటి సరఫరా చేసే విషయంలో తలెత్తతున్న సాంకేతిక ఇబ్బందులనూ, నీటి వనరుల లభ్యతను పరిశీలించి పరిష్కరించేందుకు ఏపీ, తమిళనాడు జలవనరులశాఖ ఉన్నతాధికారులతో అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. రెండేళ్ల క్రితమే కమిటీ ఏర్పాటు చేసినా నీటి సరఫరాలో విషయంలో స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది మరోసారి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి చెన్నైకు తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డు భావిస్తోంది. చెన్నై తాగునీటి కమిటీలో కృష్ణా బేసిన్ లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు సభ్యత్వం ఉంది.
తమ వంతుగా చెన్నైకు సరఫరా చేయాల్సిన నీటి వాటాను నికరజలాల నుంచి మినహాయించుకుని కమిటీ సభ్యత్వాల నుంచి తొలగించాలని మహారాష్ట్ర, కర్ణాటకలు కోరుతున్నాయి. చెన్నైకు ఏపీ అందిస్తున్న నీటి లెక్కలు సరిగా ఉన్నాయో, లేదో పర్యవేక్షణ చేసుకోవటమే తప్ప తెలంగాణకు ఈ విషయంలో ప్రత్యక్ష పాత్ర లేదు. దీంతో చెన్నైకు తాగునీరు అందించే విషయంలో ఏపీ మాత్రమే జవాబుదారీ బాధ్యతలు నిర్వహిస్తోంది. కృష్ణా నీటిని తెలుగగంగ ద్వారా చెన్నైకు 15 టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సి ఉంది.
ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను నికరంగా 12 టీఎంసీలు ఇవ్వాలి. 12 టీఎంసీలను రెండు విడతలుగా.. జులై నుంచి అక్టోబరు వరకు 8, జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 టీఎంసీలు ఇవ్వాలి. ఈ మేరకు 1976లో అంతర్ రాష్ట్ర ఒప్పందాలు కుదరగా, 1983లో ఏపీ, తమిళనాడు మధ్య ఒప్పందం కుదిరింది. శ్రీశైలానికి వచ్చే వరద ఆధారంగా చెన్నైకి నీటి సరఫరా ఆధారపడి ఉంటుంది.
వరదలొచ్చే 40 రోజుల్లో ఇస్తాం
శ్రీశైలంలో ఏటా జులైలో వచ్చే వరదలు కొంతకాలంగా ఆగస్టులో వస్తున్నాయి. ఒక వైపు వరదలొచ్చే రోజులు తగ్గిపోతుండగా మరో వైపు ఎగువ రాష్ట్రాల్రైన తెలంగాణ, కర్ణాటకలు ఎత్తిపోతల పథకాల పేరుతో, జలవిద్యుత్ పేరుతో నీటిని తోడేస్తుండటంతో శ్రీశైలంలో గరిష్ట నీటినిల్వలుండే సమయం కూడా తగ్గిపోతోంది. దీంతో 12 టీఎంసీలను చెన్నైకి తరలించటం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో 12 టీఎంసీల నిబంధనలను తొలగించకపోయినా.. నీటి సరఫరా చేసే కాలాన్ని 250 రోజుల నుంచి కేవలం 40 రోజులకు తగ్గించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. శ్రీశైలంకు పూర్తిస్థాయి వరదలొచ్చిన సమయంలో ఆ నీరు సముద్రం పాలు కాకుండా చెన్నైకు తరలించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఈ మేరకు నీటి నిల్వల కోసం చెన్నై అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ సూచిస్తోంది.
చెన్నైకి నీటిని తీసుకుంటున్న పూండి రిజర్వాయర్ వరకు కాల్వ సామర్థ్యాన్ని 1000 నుంచి 2,500 క్యూసెక్కులకు పెంచటంతో పాటు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్దం పెంచుకోవాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. దీనిపై చెన్నై కూడా సానుకూలంగానే ఉన్నా నీటి సరఫరా చేసే వ్యవధి తగ్గించటం వల్ల ఏర్పడే సమస్యలపై చర్చిస్తోంది. ఎన్ని సాంకేతిక సమస్యలున్నా చెన్నైకి ఏపీ నీరందించటంలో నిబద్దతతోనే వ్యవహరిస్తోందని తమిళనాడు ప్రభుత్వం కూడా గతంలో కృష్ణా బోర్డుకు తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై నగరానికి తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా పకడ్బందీగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టేందుకు కృష్ణా బోర్డు అధ్యయన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.