అమరావతి,అంధ్రప్రభ : రాష్ట్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేటు సర్వీసు ఏజన్సీల దందా కొనసాగుతోంది. ప్రవేటు సర్వీసు ఏజన్సీలు సిబ్బంది వేతనాల్లో కోత విధించి.. వాళ్ళ కష్టార్జితాన్ని కోట్ల రూపాయల్లో నిలువు దోపిడీ చేస్తున్నారు. గత మూడేళ్ళుగా ఈ తంతు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడలో ఆంతర్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకులంకు సంభందించి 189 పాఠశాలాల్లో శానిటేషన్, సెక్యూరిటీ సర్వీస్, కుకింగ్ కాటరింగ్ ఏజన్సీలకు ఫిబ్రవరి 2019లో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వీరికి కేవలం పది నెలల 15 రోజులకు మాత్రమే ప్రభుత్వం కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది. నిబంధనల ప్రకారం టెండర్ గడువు పూర్తి కాగానే మరలా టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే అధికా రులు టెండర్లు పిలవకుండా రెండు నెలల తాత్కాలిక పొడిగింపు పేరుతో వీరినే రెన్యూవల్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రవేటు సిబ్బందికి ప్రభుత్వం చెల్లించే వేతనాల్లో కోత విధిస్తుండడంతో ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టగానే ప్రవేటు ఏజన్సీల దందాను అరికట్టేందుకు వాటిని సమూలంగా రద్దుచేసి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కాస్‌కు అప్పజెప్పడం జరిగింది.
అయితే ముఖ్యమంత్రి ఆదేశాలను అన్ని శాఖలు అమలు పరిచాయి. గురుకులం పాఠశాలల్లో కేవలం కుకింగ్, కాటరింగ్ సర్వీసును మాత్రమే ఆప్కాస్‌కు అప్పజెప్పి మిగిలిన శానిటెషన్, సెక్యూరిటీ సర్వీసులను కొనసాగించడంలో అంతర్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు. అయితే గురుకులంకు సంబంధించి సేవా సుప్రీమ్ డిటెక్టివ్ సెక్యూరిటీ మరియు ఎస్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ అనే ప్రవేటు ఏజన్సీలను ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా గత మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ జీవో నెంబర్ 94 మరియు 151 ప్రకారం మూడు సంవత్సరముల పైబడిన ఏజెన్సీ సర్వీస్ లను రద్దు చేసి కొత్తగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే సదరు నిబంధనలను సంభందిత శాఖాధికారులు పట్టించుకోకుండా వారినే కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురుకులం పాఠశాలలో ఈ రెండు విభాగాల్లో సుమారు 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ.12వేలు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎస్ ఐ, ఈ పీఎఫ్ తో పాటు మరో 5 శాతం కమీషన్ కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. వేతనాల కింద ప్రభుత్వం ప్రవేటు ఏజన్సీలకు సంవత్సరానికి సుమారు రూ. 50 కోట్లు చెల్లిస్తోంది. అయితే ఏజన్సీల నిర్వాహకులు సిబ్బందికి ప్రభుత్వం చెల్లుస్తున్న రూ.12 వెలలో సుమారు మూడు వేలు కోత విధిస్తున్నట్లు సమాచారం.
ప్రవేటు ఏజన్సీలు సిబ్బంది వేతనాల్లో ఏడాదికి దాదాపు రూ.12 కోట్ల మేర శ్రమ దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిపై ప్రభుత్వానికి గతేడాది పలు పిర్యాదులు రావడంతో స్పందించిన అప్పటి ముఖ్య కార్యదర్శి సునీతపై మూడు సర్వీసులను ఆప్కాస్‌కు అప్పజెప్పాల్సిం దిగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే కేవలం కుకింగ్ కెటరింగ్ సర్వీసును కొంత మేర ఆప్కాస్‌కు అప్పజెప్పి మిగిలిన రెండు ప్రవేటు సర్వీసులను కొనసాగిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ లేక ఆప్కాస్‌కు అప్పజెప్పడమా అన్నది తేల్చాల్సివుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సదరు ఏజన్సీల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..