ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు.
అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ‘చలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని అన్నారు. వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను టిడిపి – జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.