Wednesday, November 20, 2024

Delhi: హంత‌కుల‌కు ఓట్లు వేయ‌వ‌ద్దు… ఓట‌ర్ల‌కు వైఎస్ సునీతా రెడ్డి పిలుపు

(ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి) – తన తండ్రిని హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని, ఇంతవరకూ హంతకులు, కుట్రదారులు ఎవరో తేలలేదన్నారు దివంగ‌త నేత వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి. న్యాయ పోరాటంలో అలుపుసలుపు లేకుండా ముందుకు సాగుతున్న‌ట్టు తెలిపారు. శుక్ర‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హంత‌కుల‌కు పాలించే హ‌క్కులేద‌ని, ప్రజాతీర్పుతో అసలు న్యాయం వెలుగులోకి వస్తుందని సునీత అభ్యర్థించారు. నాలుగేళ్లుగా వివేకా హత్య కేసును సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తూనే వస్తోంద‌ని, గతేడాది జూన్ 3న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నార‌న్నారు. నాన్న వివేకా హత్యకేసులో తమ కుటుంబానికి నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోనే సాధ్యమన్నారు. మా నాన్నకు న్యాయం కోసం ప్రజాతీర్పు కావాలని కోరుకుంటున్నానని సునీతా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జ‌గ‌న్ స‌ర్కారులో హ‌త్యా రాజ‌కీయాలు..

జ‌గ‌న్ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువ. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మా తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదని సునీతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ప్రధానమని, వీళ్లను రక్షించే పనిలో సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. జగన్‌ మీద ఉన్న 11కేసులు మాదిరిగా వివేకా హత్య కాకూడదన్నారు. మా కుటుంబానికి, నాకు న్యాయం కావాలని సునీత వేడుకున్నారు. అసలు ఈ హత్యకు మూలం ఎమ్మెల్సీ ఎన్నికలేన‌ని చెప్పారు. ఆ ఎన్నికల్లో సొంత వాళ్లే మోసం చేశార‌న్నారు. వివేకానందరెడ్డిని ఓడించారు. అయినా.. ఆయన ఎక్కడా తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహాంతో ముందుకు సాగారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోయార‌ని సునీతా చెప్పారు.

- Advertisement -

అందుకే ఆయ‌న‌ను చంపేశారు..

అందుకే వైఎస్ వివేకాను తుదముట్టించారని సునీతా రెడ్డి ఆరోపించారు. హత్య తరువాత మార్చురీ వద్ద అవినాష్‌ తనతో మాట్లాడారని.. పెదనాన్న 11.30 వరకు నాకోసం ఎదురు చూశారని చెప్పాడ‌న్నారు. ఇలాంటి స్థితిలో తన తండ్రిని కాపాడేందుకు అవినాష్ రెడ్డి, జగన్ ఎందుకు యత్నించలేదని ఆమె ప్రశ్నించారు. ఒక్కోసారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని సునీతారెడ్డి అన్నారు. సీబీఐ దర్యాప్తునకు వెళదామని జగన్‌ని అడిగితే అవినాష్‌ బీజేపీలోకి వెళ్తారని అన్నారు.. సీబీఐ విచారణకు ఆదేశం ఇవ్వాలని హైకోర్టుకు వెళ్తే.. జగన్ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు.

సీబీఐకి ఫిర్యాదు చేస్తే.. కుటుంబంపై వేధింపులు..

తాను వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేస్తే .. తన కుటుంబం, తన భర్తపై వేధింపులు ప్రారంభించారని.. చివరికి సీబీఐ పైనా కేసులు పెట్టారని సునీతా చెప్పారు. కేసు విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో, తన కుటుంబ సభ్యులతో ఎస్వీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ సంప్రదింపులు జరిపారన్నారు. ఈ కేసు నుంచి వైదొలగాలని పదే పదే ఒత్తిడి చేశారని ఆరోపించారు. తన తండ్రి వివేకా హంతకులను వదిలిపెడితే సమాజంలోకి ఏం సందేశం వెళ్తుంది? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు ? హత్యా రాజకీయాలు సమాజంలో ఉండకూదు.. వంచన, మోసానికి పాల్పడిన జగన్ అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని సునీతా రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే.. అందుకే తన తండ్రి హత్యకేసులో జగన్‌ పాత్రపై విచారణ జరపాలని, నిర్దోషి అయితే విడిచి పెట్టాలని కోరారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కులేదు, వైఎస్ జగన్‌కు ఓటు వేయవద్దని సునీతా రెడ్డి అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement