Friday, November 22, 2024

AP: మ‌నోధైర్యం కోల్పోవ‌ద్దు.. అండ‌గా ఉంటాం.. కేంద్ర బృందం

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న రైతులు, ప్ర‌జ‌లు మ‌నోధైర్యం కోల్పోవ‌ద్ద‌ని.. అండ‌గా ఉంటామ‌ని, జ‌రిగిన న‌ష్టంపై కేంద్రానికి స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ అనిల్ సుబ్రహ్మ‌ణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం పేర్కొంది.

అనిల్ సుబ్రహ్మ‌ణ్యం నేతృత్వంలో కేంద్ర బృంద స‌భ్యులు రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజ‌నీర్ రాకేష్ కుమార్‌, ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) సైంటిస్ట్ డా.ఎస్వీఎస్‌పీ శ‌ర్మ గురువారం జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. క‌లెక్ట‌రేట్‌లో వివిధ శాఖ‌ల అధికారుల నుంచి న‌ష్టాల వివ‌రాలు తెలుసుకున్న అనంతరం ప్ర‌కాశం బ్యారేజీని సంద‌ర్శించారు. బ్యారేజీ గేట్ల‌ను బోట్లు ఢీకొన్న ప్రాంతాన్ని ప‌రిశీలించి.. జ‌రిగిన న‌ష్టాన్ని తెలుసుకున్నారు. బ్యారేజీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బోట్ల తొల‌గింపున‌కు జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు.

బ్యారేజీకి ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ఈస్‌సీ ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన కేంద్ర బృందానికి వివ‌రించారు. బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ ఛాన‌ల్ (బీడీసీ)ను ప‌రిశీలించి, గండ్లు ప‌డిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న గండ్ల‌ను పూడ్చిన తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. జలవ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, స్థానిక శాస‌న‌స‌భ్యులు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రావుల‌తో కేంద్ర బృంద స‌భ్యులు చ‌ర్చించారు. గ‌ట్ల బ‌లోపేతానికి చేస్తున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు.

- Advertisement -

అనంత‌రం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, ఈల‌ప్రోలులో వ‌రి పంట‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించారు. ఈ గ్రామ ప‌రిధిలో 643 ఎక‌రాల వ‌రిపంట‌పై వ‌ర‌దలు ప్ర‌భావం చూపిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ అధికారులు వివ‌రించారు. జ‌క్కంపూడిలో ప‌ర్య‌టించి వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌తో కేంద్ర బృంద స‌భ్యులు మాట్లాడారు. ఊహించ‌ని విప‌త్తు వ‌ల్ల స‌ర్వం కోల్పోయామ‌ని.. ప్ర‌భుత్వం స‌హాయ‌స‌హ‌కారాలు అందించి ఆదుకుంటోంద‌ని, వ‌ర‌ద‌లు త‌మ జీవితాల‌కు చాలా న‌ష్టం క‌లిగించింద‌ని పేర్కొన్నారు. కేంద్ర బృందం వెంట డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement