Tuesday, November 26, 2024

AP: ల్యాండ్ టైట్లింగ్ పై అపోహలు, భయాలు వద్దు… అజేయ కల్లం

శ్రీకాకుళం, మార్చి 5 : ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2023 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. ‘హక్కులకు హామీ – రైతుకు భరోసా’ పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్ తో కలసి జిల్లాలోని రైతులు, రెవెన్యూ అధికారులు, అడ్వకేట్లు, పోలీసులకు ఈ చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు.

ఈ చట్టం వల్ల ప్రయోజనాలేంటి? ఎలాంటి మార్పులు వస్తాయి? రెవెన్యూ రికార్డుల్లో నమోదు, భూ వివాదాల పరిష్కారం, కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర, రికార్డుల నిర్వహణ లాంటి అన్ని అంశాలపై అజేయ కల్లం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాల్సిందేనని చెప్పారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థలో 66శాతం కేసులు సివిల్ తగాదాల వల్లనే ఉంటే, మరో 14 శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే నడుస్తున్నాయని, మిగిలిన దేశాల్లో కేవలం 3శాతం సివిల్ వివాదాలు మాత్రమే నమోదు అవుతున్నాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేలో భాగంగా 6000 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసిందని, ఎయిర్‌ క్రాఫ్ట్, రోవర్‌, డ్రోన్లు వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రతి భూ సరిహద్దును జియో రిఫరెన్స్‌ చేసి రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేసే విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. మొత్తం టైటిల్‌ రికార్డులు సురక్షితమైన ఆన్లైన్‌ సిస్టంలో నిల్వ చేయబడి, పాత భూరికార్డులకు స్వస్తి పలికి రైతులకు శాశ్వత హక్కులు కల్పించే దిశగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. వివాదాలుంటే సర్వే, హద్దుల చట్టం కింద సంబంధిత అధికారులను కానీ, సివిల్ కోర్టును కానీ ఆశ్రయించవచ్చని, కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీ, వారసత్వ తగాదాలు ఉంటే సివిల్ కోర్టులు ఎప్పటి లాగానే పరిష్కరిస్తాయని చెప్పారు. ఆస్తి పన్నులు, ఇతర వివాదాలు, కేసులు ఉంటే న్యాయస్థానాలు పరిష్కరిస్తాయనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. రికార్డుల వివరాలపై అభ్యంతరాలుంటే చట్టంలో పేర్కొన్న కాల వ్యవధిలో అప్పీలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 6000 గ్రామాల్లో సర్వే జరగ్గా కేవలం 2శాతం వివాదాలు మాత్రమే వ్యక్తమయ్యాయిని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సర్వే లాండ్ రికార్డ్స్ అడిషనల్ కమిషనర్ అర్.గోవింద రావు మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం సదస్సుకు వచ్చిన వారు అడిగిన పలు సందేహాలను అజేయ కల్లం నివృత్తి చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఓ ఎం.గణపతి రావు, ఆర్‌డిఓ సిహెచ్.రంగయ్య, ఎడి సర్వేయర్‌, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement