Tuesday, November 12, 2024

Gudlavelleru | అధైర్య ప‌డొద్దు.. అండ‌గా నేనున్నా : చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే అంశంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి విచారణ సాగుతోన్న విధానంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రతి 3 గంటలకోసారి తనకు రిపోర్ట్ చేయాలని అధికారులకు నిర్దేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని సీఎం అన్నారు.

విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నేరం జరిగినట్లు రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరపాలని.. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై ఆందోళ‌న చేస్తున్న‌ విద్యార్ధినులతో మంత్రి కొల్లు రవీంద్ర పలు దఫాలుగా చర్చలు జరిపారు. మంగళవారం నాటికి విచారణ పూర్తి చేసి, బాధ్యులను శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారు. ఎటువంటి వీడియోలు బయటకు రానీయకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. హాస్టల్‌లో విద్యార్దినులకు రక్షణగా మహిళా పోలీసు టీంను ఏర్పాటు చేశారు. మంత్రి రవీంద్ర హామీలకు అంగీకరించిన విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు. విచారణ పూర్తి అయ్యే వరకు తరగతులకు హాజరుకాకూడదని విద్యార్ధినిలు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement