Monday, November 18, 2024

AP: ఎర్ర స్మగ్లింగ్ వేటలో మళ్ళీ డాగ్ ఫోర్స్…

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ నిర్వహించే దాడుల్లో డాగ్ ఫోర్స్ (శిక్షణ పొందిన జాగిలాల దళం) సేవలు మళ్ళీ మొదలయ్యాయి.. రాయలసీమ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ కు నాలుగైదు దశబ్దాల చరిత్ర ఉంది. ఆ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తిరుపతి కేంద్రంగా పదేళ్ల క్రితం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ వేలాది మంది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఎర్ర దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఎప్పటికప్పుడు స్మగ్లర్ల వ్యూహ్యాలను పసిగడుతూ, వివిధ రకాల సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేసేవారిని పసికట్టి పట్టుకోవడంలో గతంలో జాగిలాల దళం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వాటి వినియోగం తగ్గింది. ప్రస్తుతం టాస్క్ ఫోర్సు వద్ద ఐదు జాగిలాలు ఉన్నాయి. అందులో రెండు తిరుపతిలో మిగిలిన మూడు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ కింద పనిచేస్తున్నాయి. ఈ జాగిలాలు చెక్ పోస్టుల వద్ద, అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాల తనిఖీల్లో, అడవుల్లో దాచివుంచే దుంగల డంప్ లను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి.

గతంలో ఈ జాగిలాల సేవలను వినియోగించుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రస్తుతం మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈరోజు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం ప్రాంగణంలో జాగిలాల పనితీరును పరీక్షించారు. ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డి, జాగిలాల ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా హంటర్, గంగ అనే రెండు జాగిలాలు దాచి ఉంచిన దుంగలను పసికట్టే తీరును ప్రదర్శించాయి. వాటి పనితీరుకు సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ఈ జాగిలాల సేవలను కూడా అదనంగా వినియోగించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement