Saturday, November 23, 2024

డ్యూటీకి డుమ్మా కొడుతున్న డాక్టర్లు.. సీరియస్ అయిన కలెక్టర్

నాయుడుపేట, (ప్రభన్యూస్‌): నాయుడుపేట డివిజన్‌ పరిధిలో కొంతమంది వైద్యులు, వైద్య సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ ఏకంగా ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను మూసివేస్తూ విధులకు డుమ్మాకొడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఓజిలి మండలం అత్తివరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని మూసివేసి వైద్యులు, వైద్య సిబ్బంది ఇళ్ల వద్ద ఉండిపోయారు. ప్రతి ఆదివారం ఆసుపత్రిని ఇలాగే మూసివేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీహెచ్‌సీని మూసివేయడంపై ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు స్పందించారు. ఈ విషయమై పరిశీలన చేసి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ రాజ్యలక్ష్మిని ఆదేశించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు నాయుడుపేట డివిజన్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీఎల్‌ దయాకర్‌ ఆసుపత్రిని మూసివేసింది వాస్తవమని తెలుసుకుని అక్కడ విధులు నిర్వర్తించే వైద్యులు, స్టాప్‌నర్స్‌కు మెమోలు జారీచేశారు.

ఆయన హెచ్చరికలు ప్రకటనలకే పరిమితం కావడంతో శుక్రవారం నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు మూసివేసి ఉంచారు. కనీసం ప్రధానగేటు తాళంకూడా తెరవకుండా ఆసుపత్రి తలుపులకు సైతం తాళాలు వేసి మూసివేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య ఉపకేంద్రాలలో హెల్త్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎంతో పాటు ఆశా కార్యకర్త అందుబాటులో ఉండి ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలను అందించాల్సి ఉంది. అన్నమేడు ఆరోగ్య ఉపకేంద్రానికి వీరిలో ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు.

ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తుఫాన్‌ ప్రభావం వల్ల వరదనీరు గ్రామాలను చుట్టుముడుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాల్సింది పోయి ఆ ఆసుపత్రులను మూసివేసి ఇళ్లకు పరిమితం అవుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది. అన్నమేడు ఆరోగ్య ఉపకేంద్రంలోనే మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) కూడా ఆరోగ్య ఉపకేంద్రానికి రాకపోవడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement