Monday, November 25, 2024

Tirumala: శ్రీవారికి ఎలాంటి ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా!

తిరుమల శ్రీవారు.. ఏడుకొండలవాడు.. వేంకన్న స్వామి.. ఇట్లా ఏ పేరుతో పిలిచి, కొలిచినా భక్తులను అనుగ్రహిస్తాడు ఆ తిరుమలేశుడు. అయితే స్వామివారికి తమ భక్తి కొద్దీ చాలామంది పలు రకాల సేవలు చేస్తుంటారు. వాటిలో ఎక్కువగా లడ్డూ ప్రసాదం ఫేమస్​.. కానీ, అలంకార ప్రియుడు అయిన తిరుమల శ్రీవారికి పూలతో అభిషేకం చేయడం కూడా ఎంతో ప్రీతికరం.. అందుకని పలు రకాల ప్రసాదాలతో పాటు పుష్ప ప్రసాదాలను నివేదనగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రోజు రోజుకూ తిరుమలలో పుష్ప ప్రసాదానికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున్న ఆదరణ వస్తోంది.. అంతేకాకుండా కొండపై పూచిన ప్రతి పువ్వు స్వామికే చెందాలన్న నిబంధన కూడా ఉంది.. అందుకని ఏడుకొండలు ఎక్కి వచ్చే వారు ఎవరైనా పూలు ధరించరాదన్న నిబంధన ఉంది. దీనికోసం క్యూలైన్​లో ఆడాళ్లు పెట్టుకున్న పూలను తొలగిస్తుంటారు..

తిరుమల ప్రసాదం అంటే సాధారణంగా అందరికీ టక్కున గుర్తొచ్చేది లడ్డూ.. ఆ తర్వాత వడ మాత్రమే. కానీ, శ్రీవారికి మరెన్నో నైవేద్యాలు సమర్పించి వాటిని ప్రసాదంగా అందిస్తుంటారు అన్న విషయం చాలామందికి తెలియదు. వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. మనకు తిరుమలలో అన్ని ప్రసాదాలు అందకపోవచ్చు. కనీసం వాటి గురించి తెలుసుకుని మన ఇంట్లో స్వామివారికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరిద్దాం.

స్వామివారి నైవేద్యసమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది. శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే స్వామివారికి ఇంకొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఇందుకోసం ఎంతో మంది రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా వితరణలు ఇచ్చి తమ భక్తిని కూడా చాటుకుంటున్నారు. అయితే ప్రసాద వితరణల కోసం అప్పట్లో ఏయే రాజులు ఎంతెంత స్వామి వారికి సమర్పించారో ఆలయ గోడలపై ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత స్వామివారికి నైవేద్యం ఎంతో నిష్టగా క్రమపద్ధతిలో సాగుతోంది. ఇక రోజూ స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు.

ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయంలో మార్పు ఉండదు. గురు, శుక్ర వారాల్లోనూ రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు స్వామివారికి తొలి నివేదన ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10 గంటలకు, మూడో గంట రాత్రి 7:30 నిమిషాలకు ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో రెండో గంట ఉదయం 7:30 నిమిషాలకు ఉంటుంది. స్వామివారికి సమర్పించే వాటిలో రోజూ ఒకే రకమైన ప్రసాదాలు ఉన్నా, ప్రతి నివేదనలో వైవిధ్యం ఉండేలా చూస్తారు.

ఉదయం 5:30 నిమిషాలకు ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యం చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు.. లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామి వారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10 గంటలకు రెండో గంట నివేదనలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సిర, సేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు.

- Advertisement -

ఇక రాత్రి 7:30 నిమిషాలకు మూడో నివేదన లో కదంబం, మొలహూర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతోపాటు ఆదివారం అయితే ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధిచెందిన ఆదివారం పిండిని శ్రీ వారికి సమర్పిస్తారు. వారంలో ఒకరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సోమవారం విశేషపూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది మాత్ర ప్రసాదం. మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం ప్రసాదాల్లో ప్రతినిత్యం సమర్పించే వాటితోపాటు తిరుప్పావడ సేవను పురస్కరించుకొని జిలేబీ, మురుకు, పాయసాలను  నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నివేదనలో కదంబం, చక్ర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సిర, సేకరబాద్, మొలహూర, తోమాల దోశలను నివేదనగా సమర్పిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పుష్ప ప్రసాదాలను కూడా భక్తులు సమర్పిస్తున్నారు. ఈ సేవకు కూడా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement