తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తిరుపతి జిల్లా అదనపు ఎస్పి సుప్రజ అన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలు, చెడు పర్యవసానాలపై ఆటో డ్రైవర్లకు, యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీన నిర్వహించబోయే అంతర్జాతీయ మత్తుపదార్థాల నిరోధక దినోత్సవం, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహనలో భాగంగా వారం రోజుల పాటు మాదక ద్రవ్యాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని కళాశాలలు, యూనివర్సిటీల వద్ద కూడా ఏర్పాటు చేయడంతో పాటు తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు తెలియజేయనున్నట్టు ఏఎస్పీ తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో కొత్తగా ఆటో నడవడానికి వస్తున్న యువకులు మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాకు వెళ్లడం ద్వారా అధిక ఆదాయం కోసం ఈ పనులు చేస్తున్నారని తెలియజేశారు. ఇది చట్ట ప్రకారం నేరం అన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.. కార్యక్రమంలో ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ. సిఐ శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.