హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే ట్రాక్ దాటుతూ స్వీయ నిర్లక్ష్యం కారణంగా చనిపోతే పరిహారం ఇవ్వనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అనుకోని సంఘటనలు, అవాంఛనీయ ఘటనల వల్ల మరణించినపుడు మాత్రమే పరిహారం పొందడానికి అర్హులని కోర్టు పేర్కొంది. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదంలో చనిపోయిన తన తల్లికి రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్‌వీఎస్ రావు రైల్వే క్లయిమ్స్‌లో అప్పీలు దాఖలు చేశారు. అక్కడ అనుకూలంగా తీర్పు రాకపోవడంతో హైకోర్టులో అప్పీలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ అనుపమా చక్రవర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వినియోగించుకోకుండా రైల్వే ట్రాక్‌ను దాటడం నేరమని పేర్కొన్న ధర్మాసనం పరిహారం చెల్లించాల్సిన పని లేదని పేర్కొంది. 6 మే 2008 న నూకల సుబ్బరత్నమ్మ హౌరా – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి సింగరాయకొండ స్టేషన్‌లో దిగింది. కందుకూరు వైపు వెళ్లేందుకు ట్రాక్ దాటుతుండగా నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో మరణించింది.