తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు తయారుచేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బరువును పోటు అధికారులు తనిఖీ చేస్తారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించి భక్తులకు అందిస్తారు. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుంది. వేయింగ్ మిషన్ సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్ట్ సిబ్బంది అవగాహన లోపం కారణంగా లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారు. లడ్డూ బరువు ఖచ్చితంగా 160 నుంచి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భక్తిశ్రద్దలతో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు.
అదేవిధంగా లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా టీటీడీ ఏనాడు రాజీపడలేదు. సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదేని ఇబ్బంది తలెత్తితే వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలియజేస్తే, అక్కడే సమస్యను పరిష్కరించే వ్యవస్థ టిటిడిలో ఉంది. కానీ సదరు భక్తుడు ఇవి ఏమి చేయకుండా సోషల్ మీడియాలో టిటిడి పై ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయం. కావున భక్తుడు ఆరోపించినట్లు లడ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్యత్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.