జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడర్ కు సూచించారు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దన్న ఆయన.. జనహితానికీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ అని స్పష్టం.. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని సూచించారు పవన్.. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగినట్టు అవుతుందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలూ, సందేహాలు ఏమైనా ఉంటే రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలన్నారు.. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయి.
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకుంటున్నామన్నారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.