Tuesday, November 26, 2024

AP | వాలంటీర్లకు ఎన్నికల విధులను అప్పగించవద్దు : ఈసీ

ఏపీలో రానున్న ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేళ్లకు సిరా పూసే బాధ్యతను మాత్రమే అప్పగించాలని ఈసీ పేర్కొంది. వారికి ఇతర ముఖ్యమైన పనులు అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించింది. ఎన్నికల విధుల కోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదంటూ సీఈవోకు లేఖ రాసింది. ప్రతి పోలింగ్ పార్టీలోనూ రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని నియమించుకోవచ్చని తెలిపింది.

బీఎల్వోలుగా పనిచేసిన సిబ్బందిని మాత్రం పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. పోలింగ్ రోజున ఇతర పనులు కేటాయించేలా బీఎల్వోలకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం సీఈవోను ఆదేశించింది. అంతేకాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగం చేయకూడదని EC నిర్ణయించింది. వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించరాదని పేర్కొంది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను అనుమతించకూడదని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

ఈసీ లేఖ నేపథ్యంలో… గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించేందుకు అభ్యంతరం లేదని కలెక్టర్లు, అధికారులకు సీఈవో సందేశం పంపారు. వీరికి పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించవచ్చని సూచించారు. ఎన్నికల సందర్భంగా సచివాలయ సిబ్బందికి ప్రధాన విధులు అప్పగించరాదని ఈసీ సూచనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలకు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement