Friday, November 22, 2024

ఇళ్ల నిర్మాణంలో రాజీపడొద్దు.. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిండి : సీఎం జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉంచుకొని నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. డ్రైన్లు సహా అన్ని మౌళిక సదుపాయాలు ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన గృహ నిర్మాణశాఖపై సమీక్ష సందర్భంగా జగనన్న కాలనీల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సమీక్షించారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భూమి మెరక, ఫిల్లింగ్‌, అంతర్గత రహదార్లు, గోదాముల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మూడో ఆప్షన్‌ గృహాల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్న అధికారులు అవసరాలకు అనుగుణంగా కొత్త పనులు మంజూరు చేసి పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ మూడో ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న వారి గృహాల నిర్మాణం సత్వరమే పూర్తి చేసేందుకు నిర్థేశించిన ప్రామాణికాలను పాటించాలన్నారు. కాలనీలకు సమీపంలో ఇటుకల తయారీ యూనిట్లు సహా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇదే సమయంలో గోదాములు తదితర కనీస అవసరాలను సమకూర్చుకొని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నెలాఖరులోగా కోర్టు వివాదాల్లోని పట్టాలపై స్పష్టతకు అధికారులు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. దీనిపై ఆగస్టు మొదటి వారంలో ప్రత్యమ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలని పేర్కొన్నారు. కాలనీల్లో డ్రైనేజీ, విద్యుత్‌, నీటి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇళ్లలో ఫ్యాన్లు, విద్యుత్‌ బల్పులు, ట్యూబులైట్లు నాణ్యతలో రాజీపడొద్దని ఆయన స్పష్టం చేశారు. జగనన్న కాలనీలతో కొన్ని చోట్ల మున్సిపాలిటీలే తయారవుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లో మౌళిక సదుపాయాల కల్పన, పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నిర్మాణాల నాణ్యతపై ప్రతి దశలోనూ అధికారులు దృష్టిసారించాలన్నారు.

90 రోజుల్లో పట్టాల పంపిణీ..

మూడు నెలల్లో పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సమీక్షించారు. లబ్దిదారులకు స్థలం చూపించడమే కాదంటూ సంబంధిత స్థలానికి పట్టా, ఇతర పత్రాలన్నీ అందజేయాలన్నారు. స్తలంతో పాటు పట్టా, ఇతర డాక్యుమెంట్లు ఇచ్చినట్లు లబ్దిదారులతో ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement