అమరావతి, ఆంధ్రప్రభ: సరుకు రవాణా, ప్యాసింజర్ రవాణాలో గణనీయమైన పురోగతి ద్వారా విజయవాడ రైల్వే డివిజర్ రికార్డు సృష్టించింది. గతేడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికం కన్నా ఈ ఏడాది అదే సమయంలో 79.97 శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది రూ. 648.26 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ. 1166.69 కోట్లు సాధించింది. అలాగే గతేడాది కన్నా 381 శాతం మంది అధికంగా మొత్తం 13.783 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించారు. ప్యాసింజర్‌ఒ రవాణాలో 232.72 శాతం వృద్ధితో రూ. 288.17 కోట్ల ఆదాయం, 7.848 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాతో గతేడాది కన్నా 49.21 శాతం వృద్ధి నమోదైంది. ఐరన్ ఓర్, టింబర్ వేస్ట్, ఫిష్ ఫీడ్ తదితర సరుకును రవాణా చేయడం ద్వారా ఈ ప్రగతి సాధ్యమైంది. అదే సమయంలో మౌలిక వసతుల కల్పనలో డివిజన్ ముందంజలో ఉంది. ఆరవల్లి- నిడదవోలు మధ్య డబ్లింగ్ పనుల పూర్తి ద్వారా కోచింగ్ ట్రైన్ ఆపరేషన్స్ ప్రారంభించి కొత్త లైన్లో 70 కిలోమీటర్లు, డైవర్షన్ లైన్లో 80 కిలోమీటర్లు గంటకు వేగాన్ని పెంచడం సాధ్యమైంది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 7 లెవల్ క్రాసింగ్ గేట్స్ తొలగించడంతోపాటు పలు చోట్ల ఆర్‌యూబీ, ఆర్‌వోబీలు నిర్మించింది. మరోవైపు ‘జీరో’ ట్రైన్ యాక్సిడెంట్స్ దిశగా రైల్వే పలు సేఫ్టీ చర్యలు చేపట్టింది. అందుకోసం బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, పాంప్లెట్ల పంపిణీ, కౌన్సెలింగ్ నిర్వహణ వంటివి చేపట్టడంతోపాటు డీఆర్ ఎం శివేంద్ర మోహన్ ఆధ్వర్యంలో సేఫ్టీ సెమినార్ నిర్వహించారు. సీఎల్‌ఎస్ రిమోట్ మానిటరింగ్ సిస్టం, డెవలప్‌మెంట్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్ డ్రాపింగ్ సిస్టం వంటి ఆవిష్కరణలను అమలులోకి తెచ్చారు. ఎన్విరాన్‌మెంటల్ డే, స్టార్టప్ పాలసీ, ఇంటర్నేషనల్ యోగా డే వంటివి నిర్వహించడం ద్వారా విజయవాడ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముందంజలో నిలిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.