Sunday, September 15, 2024

AP: చిత్తూరు జిల్లాకు కృష్ణానదీ జలాల మళ్లింపు… మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు : చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి కృష్ణా జలాలను చిత్తూరుకు మళ్లించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన చిత్తూరు పోలీస్ పేరెంట్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… జిల్లా సమగ్ర అభివృద్ధికి, అన్నదాతల మోములో చిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకురానున్నట్లు వివరించారు. కృష్ణా జలాల కారణంగా జిల్లాలో తాగునీరు, సాగునీరు అవసరాలు తీరుతాయని, జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పాలనలో బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాలోని 2,71,442 మంది పింఛన్ దారుల‌కు ఒకటవ తారీఖున పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పించను మొత్తాలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

తొలుత మంత్రి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిని వివరిస్తూ జరిగిన శకటాల ప్రదర్శనను పరిశీలించారు. విద్యార్థుల నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్త ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడీ రాజశేఖర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీ మోహన్, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు థామస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement