Friday, November 22, 2024

పూర్తి అప్‌గ్రేడేషన్‌లో జిల్లా హాస్పిట‌ల్స్..

విజయనగరం, (ప్రభన్యూస్‌) : వైద్య రంగం దశ.. దిశ.. మార్చే అంశంగా జగన్‌ సర్కార్‌ ప్రత్యేక చొరవ చూపడంతో ఆమేరకు చక్కని కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిపుచ్చుకొని ఏపీఎంఎస్‌ఐడీసీ (ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ముందుకేగుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు వీలుగా పీహెచ్‌సీలు.. సీహెచ్‌సీలు.. అప్‌గ్రేడేషన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల రాకతో జిల్లా వైద్యరంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది సుస్పష్టం. ఇప్పటికే ఏపీఎంఎస్‌ఐడీసీ జిల్లాలో పలు చోట్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టింది.

జిల్లాలోని పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు అప్‌గ్రేడేషన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల ఏపీఎంఎస్‌ఐడీసీ విడుదల చేసిన ప్రగతి నివేదికను పరిశీలించినట్లయితే జిల్లాలోని ఆస్పత్రుల అభివృద్ధి పనులు, అప్‌గ్రేడేషన్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయనే చెప్పాలి. నాడు నేడు పనుల్లో భాగంగా జిల్లాలోని 9 ఆస్పత్రుల్లో 81 ఐసీయు, 338 నాన్‌ ఐసీయు పడకలకు రూ. 3.18 కోట్లతో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌కు ప్రతిపాదించామని, వీటిలో ఇప్పటికే 51 ఐసీయు, 213 నాన్‌ ఐసీయు.. కలిపి మొత్తం 264 పడకలకు ఆక్సిజన్‌ సరఫరా చేసే పరిస్థితి వుందని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సత్యప్రభాకర్‌ తెలిపారు. ప్రతిపాదించిన 9 పనుల్లో 7 చోట్ల పనులు జరుగుతున్నాయని, మరో రెండు చోట్ల ప్రారంభం కావాల్సి ఉందని సత్య ప్రభాకర్‌ ప్రభ ప్రతినిధికి వివరించారు.

పూర్తి స్థాయిలో నిధులు వచ్చిన తర్వాత మిగతా పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. పార్వతీపురంలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌, బొబ్బిలిలో సీహెచ్‌సీ పనులు పూర్తయ్యాయినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోడ్‌ అనంతరం వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని, ఇప్పుడు నిర్మించతలపెట్టిన భవనాలు, మరమ్మత్తులు చేపడుతున్న భవనాలు వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్లు సత్య ప్రభాకర్‌ పేర్కొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement