Thursday, September 12, 2024

AP: సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ ప్రభుత్వ బాధ్యత.. అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆగస్టు 31(ప్రభ న్యూస్ బ్యూరో): సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, మత్స్య, పశు సంవర్థక అండ్ డైయిరీ అభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శనివారం టెక్కలి మండలం రావివలసలో ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక బాధ్యత పింఛన్లు, ప్రభుత్వ భవనాలు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉందన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 90 అవుతుందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకటీ ఒకటీ హామీలు నెరవేరుస్తున్నామన్నారు.

జూలైలో 7వేల రూపాయిలు, ఆగస్టు నెలలో రూ.4వేలు పెన్ష‌న్లు ఇచ్చినట్లు చెప్పారు. వాలంటీర్ల కంటే ముందుగానే పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 1వ తేదీన ఆదివారం వచ్చినందుకు అధికారులకు ఇబ్బంది లేకుండా ముందురోజే ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫించన్లు వస్తాయని ఆత్మ విశ్వాసంతో అందరూ ఎదురు చూస్తారన్నారు. ఎండలమల్లిఖార్జున స్వామి ఆలయానికి ఇప్పటికే గతంలో కొన్ని నిధులు మంజూరు చేయడమైనదని, దేవాదాయ శాఖ అధికారులను తీసుకువచ్చి వారితో చర్చించి ఆలయం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

ఉపాధి హామీ నిధుల నుండి కాలనీ వాసులకు 140 కోట్ల రూపాయలతో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, కాలువలు నిర్మిస్తామని వివరించారు. సెప్టెంబర్ లో నీటి సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయని, గొడవలు పడకుండా రైతులంతా సమన్వయంతో కాలువ బాగు చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందన్నారు. మూలపేట పోర్టు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. మూలపేట నుండి విశాఖపట్నం వరకు తీర ప్రాంతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లు కోటబొమ్మాళి, టెక్కలిలో తన స్వంత నిధులతో ప్రారంభించినట్లు చెప్పారు.

ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. నిర్మించిన గృహాలకు సంబంధించి బిల్లులు అవ్వకపోతే అప్ లోడ్ చేయాలని చెప్పారు. సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడీలో పెడుతున్నారన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. అవినీతి లేకుండా ధర్మం, న్యాయంతో పారదర్శక పాలన అందించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మెచ్చుకొనే విధంగా పాలన ఉంటుందన్నారు. గ్రామ ప్రజలు చూపిన ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీ సేవకుడుగా, మంచి తత్వంతోనే నాయకులౌతారని చెప్పారు.

తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, శాలువాలు తీసుకురావద్దని, అవి తెచ్చే బదులు మొక్కలు తీసుకువస్తే పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రూ.77.30 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. గ్రామ సచివాలయ భవనం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.

మాజీ జడ్పీటీసీ కెఎల్ నాయుడు మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, గృహాలు లేనివారికి గృహాలు, తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసువచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో సుదర్శన్ దొర, ఇన్ చార్జ్ డీపీఓ ఆర్.వెంకట్ రామన్, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, టెక్కలి ఎంపీపీ ఎ.సరోజనమ్మ, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్, మాజీ ఎంపీపీ సుందరమ్మ, పశు సంవర్థక శాఖ జేడీ జయరాజు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement