తిరుపతి, (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన స్ఫూర్తి గా టిటిడి అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే ఏడాది జూన్ నుంచి విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్నట్టు టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ప్రకటించారు. ఈ రోజు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం టీటీడీకి చెందిన పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక కిట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాకానుక లోగోను కూడా ఆవిష్కరించారు.
ఆ కార్యక్రమంలో సదా భార్గవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న జగనన్న విద్యాకానుకను స్ఫూర్తిగా తీసుకొని టీటీడీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అందిస్తున్న ఈ విద్యాకానుక వారికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలియజేశారు. 2327 మంది టీటీడీ పాఠశాలల విద్యార్థులకు టీటీడీ నిధులతో విద్యాకానుకను అందిస్తున్నట్టు తెలిపారు.
ఇందులో యూనిఫారమ్, నోటుపుస్తకాలు, బెల్టు, బూట్లు ఉన్నాయని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూన్ నెలలోనే ఈ విద్యా కానుకను విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. టీటీడీ పాఠశాలల్లో మరింతగా విద్యాప్రమాణాలు పెంచేందుకు పేరెంట్స్-టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
టీటీడీ విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు టీటీడీ విద్యా కానుక ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.సురేంద్ర బాబు మాట్లాడుతూ పాఠశాల ప్రగతి నివేదికను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.