Sunday, November 17, 2024

AP | ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనార్టీలకు అసైన్డ్‌ భూముల పంపిణీ.. 55 వేల ఎకరాల పంపిణీకి కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ రాష్ట్రంలో చుక్కల భూములకు విముక్తి కల్పించిన ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల్లో అర్హులైన లబ్ధిదారులకు సుమారు 55 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు తమకు కేటాయించాలంటూ స్థానిక ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు అధికమైనట్లు సమాచారం. ప్రస్తుతానికి ఒక్కో లబ్ధిదారునికి రెండెకరాల నుంచి ఐదెకరాలు మించకుండా పట్టాలిచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం రికార్డులు తయారు చేసే పనిలో నిమగమైనట్లు సమాచారం.

- Advertisement -

అసైన్డ్‌ భూములకు సంబంధించి 26 జిల్లాల కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల్లో లభ్యతగా ఉన్న భూములు, అర్హులైన లబ్ధిదారుల పేర్లను జిల్లా అసైన్డ్‌ కమిటీలు అప్రూవల్‌ చేసిన వివరాలతో కూడిన నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఇందుకు సంబంధించి ఎప్పుడు ఎలా పంపిణీ చేయాలనే విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి అసైన్డ్‌ భూముల పట్టాల పంపిణీకి ఎప్పుడైనా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చే అవకాశమున్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో మాదిరి మండల తహశీల్దార్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టకుండా, ఈ దఫా ఎపి ఆన్‌లైన్‌ సేవ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఎ, బి, సి క్లాస్‌లుగా విభజన

రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి సిద్ధం చేసే భూములను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ భూమి, లంక భూములు (ఎ-క్లాస్‌, బి-క్లాస్‌), లంక భూములు (సి-క్లాస్‌) పేరుతో విభజించినట్లు సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పట్టాపై తహశీల్దారు సంతకం ఉండనుంది. లంకభూములు (ఎ అండ్‌ బి క్లాస్‌), లంకభూములు (సి-క్లాస్‌) పట్టాలపై ఆయా జిల్లా కలెక్టరు సంతకంతో మంజూరు చేయనున్నారు. ఆధార్‌తో సహా అన్ని వివరాలతో పట్టా పట్టాలపై లబ్ధిదారుని వివరాలకు సంబంధించి ఆధార్‌ నెంబరు, లబ్ధిదారుని పేరు, జెండర్‌, సమీప బంధువు పేరు, ఏ రకంగా బంధువు, జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేయనున్నారు. వీటితోపాటు భూమికి సంబంధించి జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబరు,ల్యాండ్‌ పార్శిల్‌ నెంబరు (మల్టిపల్‌ సర్వే నెంబరు,ఎల్‌పి నెంబర్స్‌,) విస్తీర్ణంతో పాటు ఖాతా నెంబరు, భూమి స్వభావం, విస్తీర్ణం నమోదు చేస్తారు.

అంతేకాకుండా సర్వే నెంబరు వారీ భూమి మొత్తం విస్తీర్ణాన్ని గుణించి పట్టాపై నమోదు చేయనున్నారు. పట్టా మీద లబ్ధిదారుని పూర్తి వివరాలు నమోదు చేయడంతో భవిష్యత్తులో మరొకరికి బదలాయించే అవకాశం, లేక అమ్ముకునే అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లబ్ధి దారుని ఆధార్‌ నెంబరు నమోదు చేస్తుండటంతో మరో దఫా వ్యవసాయ భూమి కావాలని దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అనంతరం తహశీల్దార్‌ లాగిన్‌కు బదలాయింపు జరుగుతుంది. అక్కడ పరిశీలన అనంతరం అప్రూవల్‌ కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు ఫైలు ఆన్‌లైన్‌లో పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రభుత్వం నూతనంగా అసైన్డ్‌ పట్టాల పంపిణీకి ఆన్‌లైన్‌ విధానాన్ని ఎన్నుకోవడంతో లబ్ధిదారుల వివరాలు తారుమారుకావడానికి అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement