144 అసెంబ్లీ, 17 లోక్ సభ అభ్యర్ధులకు
బి ఫామ్స్ ఇచ్చి ప్రమాణం చేయిచిన చంద్రబాబు
అయిదుగురు అభ్యర్ధులు మార్పు
ఉండి నుంచి రఘురామ
మాడుగుల నుంచి బండారులకు ఛాన్స్
అనపర్తి పంచాయితీకి తెర
బిజెపి అభ్యర్ధిగా నల్లమిల్లి పోటీ
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ముందుగా లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారంలను అందించారు. మొత్తం 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ అభ్యర్థులకు బీ ఫారం లను అందజేశారు.
అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు.
కాగా.. బీ ఫారంల పంపిణీకి ముందుగానే.. ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. ఉండి ఎమ్మెల్యే టికెట్ ను రఘురామకు కేటాయించగా.. పాడేరు టికెట్ ను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించింది అధిష్ఠానం. అలాగే మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తికి, ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణను బరిలోకి దింపింది.
అనపర్తి బిజెపి అభ్యర్థిగా నల్లమిల్లి
మరోవైపు అనపర్తి టికెట్ పై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీనుంచి పోటీ చేసేలా అంగీకారం తెలిపారు. దీంతో అక్కడ కొన్ని నెలలుగా సాగుతున్న కూటమి అసమ్మతి సెగకు తెరపడింది..