Friday, November 22, 2024

భగ్గుమన్న అసమ్మతి.. పిన్నెల్లి, బాలినేని అనుచరుల ఆందోళన.. బైకులు దగ్ధం (వీడియో)

అమరావతి, ఆంధ్రప్రభ: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రవ్యాప్తంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి భగ్గుమంది.. కొత్త కేబినెట్‌లో చోటుదక్కుతుందని ఆశించిన పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలకు శృంగభంగం కలిగింది.. సామాజిక సమీకరణలు.. ప్రాంతాలు..వర్గాల వారీగా ప్రాధాన్యత కల్పించామని చెప్తున్నప్పటికీ అంతర్గ తంగా ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా పార్టీలో నెలకొన్న వర్గపోరు కొత్త కేబినెట్‌ ఏర్పాటుతో పతాక స్థాయికి చేరింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల టీంలో భాగంగా 25మంది కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే పాలనా వ్యవహారాల్లో సీనియర్లు కూడా ఉండాలనే భావనతో కొందరు సీనియర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ వడపోత తరువాత 15 మంది కొత్త, మరో 9 మంది పాత మంత్రుల కు కేబినెట్‌ బెర్త్‌లు దక్కాయి. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో ఆయన సతీమణిని అభ్యర్థిగా ఎంపిక చేయటంతో పాటు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించనున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేస్తున్న తమకు మంత్రివర్గంలో ఛాన్స్‌ ఇవ్వకపోవటాన్ని సీనియర్‌ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.

జగన్‌కు సమీప బంధువైన ప్రకాశం జిల్లా నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఉద్వాసన పలకటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్‌ అడుగులో అడుగేసి వెన్నంటి ఉన్నప్పటికీ చివరకు తనకు అవమానమే మిగిలిందని బాలినేని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి లోనుకావటంతో పాటు రక్తపోటు అధికం కావటంతో వైద్యులు చికిత్స నిర్వహించారు. బాలినేనితో నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని బుజ్జగించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలోని బాలినేని క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని కొద్దిసేపు మంతనాలు జరిపారు. మంత్రి పదవి నుంచి నిన్ను కూడా తొలగిస్తున్నాం.. అంటూ ఇటీవల సీఎం జగన్‌ బాలినేనితో అన్న సందర్భంలో తనతో పాటు అందర్నీ కొత్తవారిని పెట్టుకోవాల్సిందిగా ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ప్రకాశం జిల్లాలో తనకు అంతర్గత ప్రత్యర్థిగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాబితాలో బాలినేని పేరులేదని తెలుసుకున్న ఆయన వర్గం అనుచరులు ఒంగోలు నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సైతం ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొలివిడత కేబినెట్‌లోనే చోటు దక్కుతుందని ఆశించారు. అయితే రెండో విడత కూడా ఆయనకు ప్రాతినిధ్యం కల్పించకపోవటంతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.. కార్యకర్తలు టైర్లను దగ్ధంచేసి నిరసన వ్యక్తం చేయటంతో పాటు మాచర్ల- రెంటచింతల రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గంలో మాచర్ల మునిసిపాల్టిd చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, ఐదు మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్‌లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. కాగా కాపు సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్‌గా ఉన్న సామినేని ఉదయభాను కూడా సీనియర్‌గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తొలివిడత కేబినెట్‌లోనే ఆయనకు మంత్రిపదవి ఉంటుందని భావించారు. జాబితా ప్రకటనకు కొద్దిగంటల ముందు కూడా ఆయన తనకు మంత్రిపదవి ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు. అయితే జాబితాలో చాన్స్‌ లేకపోవటంతో అసంతృప్తితో ఉన్నారు. జగ్గయ్యపేటలో ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. పార్టీకి సేవలందించినా ప్రతిఫలం లేకపోవటాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.

కాగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం లేకపోవటంతో కన్నీటిపర్యంతమయ్యారు. నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధనరెడ్డికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్తున్నా సీనియర్‌గా తాను పార్టీకి సేవలందిస్తున్నా ప్రాతినిధ్యం కల్పించక పోవటాన్ని ఆక్షేపిస్తూ కార్యకర్తల ముందు కన్నీరు పెట్టారు. అయితే తనకు మంత్రిపదవి దక్కకపోయినా పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని జగన్‌ వెంట సైనికుడిలా నడుస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీపై పోరు సాగించి లోకేష్‌పై విజయం సాధించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మొండిచేయి చూపటంతో నియోజకవర్గ క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది. సామాజిక సూత్రీకరణల ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయాన్ని కాంక్షించి కూర్పు జరిగిందని భవిష్యత్‌లో అందరికీ గుర్తింపు ఉంటుందని సీఎం జగన్‌ భరోసా ఇస్తున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొత్త కేబినెట్‌లో ప్రాతినిధ్యంలేని కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ప్రత్యామ్నాయంగా కేబినెట్‌ హోదా పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రతిపాదనలో ఉన్న స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయటంతో పాటు చైర్మన్‌గా కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా క్షత్రియ కులం నుంచి ప్రసాదరాజు, డిప్యూటీ స్పీకర్‌గా వైశ్య వర్గం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని నియమించాలని నిర్ణయించటం ద్వారా జనాభా దామాషా ప్రకారం అన్నివర్గాలకు భరోసా కల్పించినట్లవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement