సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు పార్టీల నేతలకు గాయాలవ్వగా.. 7 వాహనాలు ధ్వంసమయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఏ క్షణాన్నైనా మళ్లీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ దుకాణాలు మూయించిన పోలీసులు… హై అలర్ట్ లో ఉన్నారు.
అయితే, కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి… వైసీపీ నుంచి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలోకి జమీర్ చేరుతున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అతన్ని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం చెలరేగి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పెద్దఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో నలుగురు టీడీపీ నేతలు గాయపడ్డారు.