అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో భద్రతా లోపం వైఫల్యం మరోసారి స్పష్టమైంది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ రాక సందర్భంగా అభిమానులు అంతరాలయంలోకి దూసుకెళ్లారు. శ్రీ అమ్మవారి ఆలయంలో జై భవానీ నినాదాలకు బదులుగా..జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేశారు. క్యూలైన్ రైలింగ్ రాడ్లను ఎక్కి మరీ లోనికి వెళ్లిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకున్నారు. పలువురు అభిమానులు పవిత్రమైన హుండీలపైకెక్కి రామ్ చరణ్‌ను చూసేందుకు పోటీలు పడటంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. మరో రెండు రోజుల్లో చిరంజీవితో కలిసి రామ్‌చరణ్ నటించిన ఆచార్య చిత్రం విడుదల కాబోతోంది.
సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకొని బుధవారం రామ్‌చరణ్ అమ్మవారి దర్శించుకునేందుకు వచ్చారు. విషయం తెలిసిన రామ్‌చరణ్ అభిమానులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. రామ్ చరణ్ అమ్మవారి దర్శనం చేసుకునే సమయంలో ఒక్కసారిగా అభిమానులు నెట్టుకురావడంతో రైలింగ్ రాడ్లు విరిగాయి. వీరిని కట్టడి చేయడంలో పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది విఫలమైనారు. కొందరు రైలింగ్ రాడ్ల పైనుంచి దూకి రామ్ చరణ్‌ను చేరుకొని సెల్ఫీలు దిగారు. వీరి హడావుడితో క్యూలైన్లలో తొక్కిసలాట చోటు చేసుకొని సాధారణ భక్తులు బెంబేలెత్తారు. చివరకు పోలీసులు అభిమానులను చెదరగొట్టి రామ్ చరణ్‌ను దర్శనానంతరం ఆలయం వెలుపులకు తీసుకెళ్లారు.