తామర పురుగు మిర్చిని తొలిచేస్తుండగా, ఇప్పుడు కందిపంటకు కూడా కష్టాలొచ్చాయి. కందికి పట్టిన నల్లి పురుగు పంటను పీల్చి పిప్పి చేస్తోంది. పూతను, పిందెను ఎక్కడికక్కడ రాల్చేస్తోంది. ఎన్ని మందులు చల్లినా నల్లిపురుగు అంతకంతకూ విస్తరించటంతో కంది పంటకు వెర్రి తెగులు (ఎస్.ఎం.డీ-స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్) సోకింది. దీంతో ఎన్నడూ లేని విధంగా 6 లక్షలకు పైగా ఎకరాల్లో కందిని సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే 60 శాతం పంట పాడైందని చెబుతున్నారు. గత ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో ఈ సీజన్ లో కూడా రైతులు కంది సాగు వైపు మొగ్గు చూపించారు. అధికారిక అంచనాల ప్రకారం 6.14 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా మరో 50 వేల ఎకరాలు అదనంగా ఉంటుందని అంచనా. దాదాపు అన్ని జిల్లాల్లో కంది పండిస్తుండగా.. అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సాగు విస్తీర్ణం బాగా అధికం. అనంతపురం జిల్లాలో వేరుశెనగ విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానంలో కంది సాగు చేపట్టారు. గత ఏడాది 1.2 లక్షల ఎకరాల్లో కంది సాగు చేస్తే ఈ ఏడాది విస్తీర్ణం 1.85 లక్షల ఎకరాలకు పెరిగింది. వెర్రి తెగులు (స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్) అంతటా ఉండగా ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉంది. మూడు జిల్లాల్లో వెర్రి తెగులు ధాటికి పూత, పిందె నిలవకపోవటంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఈ తెగులు సోకిన 60 నుంచి 70 శాతం విస్తీర్ణంలో 10 నుంచి 15 కిలోల దిగుబడి కూడా రావటం కష్టమేననీ.. పెట్టుబడంతా నష్ట పోవటమేనని రైతులు చెబుతున్నారు. కంది సాగును అధిక విస్తీర్ణంలో కౌలు రైతులే సాగు చేస్తుంటారు. ఎకరాకు 10 నుంచి 12 వేలు చెల్లిస్తారు.. సాగు వ్యయం మరో రూ 12 వేల దాకా ఉంటుంది. ఎకరాకు రూ 24 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటనంతా వెర్రి తెగులు కబళిస్తోందని రైతులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినా, వ్యవసాయ నిపుణులు అందించిన సూచనటన్నిటినీ పాటించినా తెగులు పోవటం లేదంటున్నారు. తాజా అంచనాల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో పూర్తిగానూ, మరో లక్ష ఎకరాల్లో పాక్షికంగానూ పంట దెబ్బతినే అవకాశం ఉంది.. పెట్టుబడి వ్యయం సుమారు రూ.1000 కోట్లు రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో మిర్చికి పట్టిన తామర పురుగు నివారణ కోసం ప్రత్యేక శద్ధ చూపించినట్టు గానే కందిపంటపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలనీ, తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital