Friday, January 10, 2025

AP | మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం.. 20 లక్షల ఉద్యోగాలపై చర్చ!

  • అధికారులకు లోకేష్ దిశానిర్దేశం
  • ప్రతి 15 రోజులకు మంత్రివర్గ ఉపసంఘం
  • 1995-2004తో పోలిస్తే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది
  • లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలపై.. లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

ఈ మేర‌కు సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతుందని తెలిపారు. నెలలో ఒకసారి సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని లోకేశ్ అన్నారు.

పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు తీసుకురావడం అంత సులభం కాదని చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశార‌ని.. పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారన్నారు. 1995-2004తో పోల్చుకుంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిందని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని అదేశించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ ప్రభుత్వ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, సీఎస్ విజయానంద్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement