Thursday, November 21, 2024

ఆరోగ్యశాఖలో డిజిటల్‌ సేవలు

విశాఖపట్నం : దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే కేంద్రం ఆదేశాలతో డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ను పర్యవేక్షించడానికి రాష్ట్రంలో ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించడంతో పాటు వారికి కూడా 14 అంకెలతో కూడిన ఐడి కేటాయిస్తారు. ఆ తరువాత ప్రతి జిల్లాలకు ఇద్దరు అధికారులను కేటాయించడంతో పాటు, ఆ ఇద్దరు అధికారులకు సైతం రెండు ఐడిలు కేటాయిస్తారు. వీరిలో జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా డీఎంహెచ్‌వో వ్యవహరించగా, డిస్ట్రిక్ట్‌ వెరిఫైయర్‌గా జిల్లా ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ ఉంటారు. వీరి పర్యవేక్షణలో జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 990 కేంద్రాల్లోని రోగుల వివరాలను గ్రామస్ధాయి నుంచి ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను ప‌క్కాగా సేకరించి ఆయా వివరాలను గ్రామస్థాయిలో ఉన్న ఆరోగ్య సిబ్బంది ఐడిలో డిజిటల్‌ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. దీని ద్వారా ఏఏ ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు ? ఏ ప్రాంతంలో సీజనల్‌ వ్యాధుల ఉన్నాయి ? అనే వివరాలను ఉన్నతాధికారులు స్వయంగా తెలుసుకునే అవకాశముంది.


తొలి విడతలో ప్రభుత్వ ఆసుపత్రల్లోనే :
నూతనంగా ఆరోగ్యశాఖలో అమల్లోకి తీసుకువస్తున్న డిజిటల్‌ సేవలను తొలి విడతలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 990 ఆరోగ్య కేంద్రాలను గుర్తించగా, వీటిలో 808 సబ్‌సెంటర్లు, 163 పిహెచ్‌సీలు, 18 సిహెచ్‌సీలు, ఒక జిల్లా ప్రధాన ఆసుపత్రి (కేజీహెచ్‌)గా అమలు చేయనున్నారు. అయితే ఈ కేంద్రాలకు అనారోగ్య సమస్యలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్‌ వ్యాధులతో భాదపడుతూ వైద్యసేవల నిమిత్తం వచ్చే రోగులకు వారికి సకాలంలో మెరుగైన వైద్యసేవలందించడంతో పాటు వారి ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. ముఖ్యంగా ప్రతి రోగికి 14 అంకెలతో కూడిన ఐడి కేటాయించేందుకు ప్రతి రోగి వివరాలతో పాటు ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌లను సేకరించి వాటి ద్వారా ప్రతి రోగికి ప్రత్యేకంగా ఐడి కేటాయించనున్నారు. దీని ద్వారా రోగికి గతంలో ఏ తరహ వైద్యం అందింది, ఇప్పుడు ఏ వైద్యసేవలు అవసరమో అనే వివరాలను కూడా అందులో పొందుపర్చనున్నారు. తొలి విడతలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్ధాయిలో రోగిల వివరాలు నమోదైన తరువాత ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఆసుపత్రికి ఐడి అందిస్తారు. ఆ ఐడి ప్రకారం ఆయా ఆసుపత్రిలకు వచ్చే రోగుల ఆరోగ్య వివరాలను ఆయా పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. పేషెంట్‌ వివరాలతో పాటు వారు చికిత్స చేయుంచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల వివరాలు, వైద్యం చేసిన డాక్టర్ల వివరాలు కూడా నమోదు చేస్తారు.

- Advertisement -


త్వరలోనే పిహెచ్‌సీల్లో సూపర్‌స్పెషాల్టి వైద్యసేవలు :
ప్రత్యేక వైద్యసేవల కోసం ఇక నుంచి జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదు…గ్రామాల్లోనే మరింత మెరుగైన వైద్యసేవలందనున్నాయి. అవి కూడా సూపర్‌ స్పెషాల్టి సేవలు…దూరప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు పొందనవసరం లేదు..సొంత గ్రామంలోనే సాధారణ వైద్యసేవలతో పాటు, ఈఎన్‌టీ, మెంటల్‌కేర్ (మానసిక వైద్యం), దంత, కంటి, చిన్నారులకు సైతం ఆరోగ్యసేవలను మరింత విస్తృతం చేయనున్నామని డిఎంహెచ్‌వో డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ తెలిపారు. ప్రతి పిహెచ్‌సీని వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా ఆయుష్‌మ్మాన్‌ భారత్‌ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రతి నెలా నిర్ణత తేదిల్లో స్పెషలిస్ట్‌ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళ్లి రోగులను పరీక్షంచనున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే ఈ సూపర్‌ స్పెషాల్టి వైద్యసేవలు అందనున్నాయి. దీంతో జిల్లా కేంద్రాలకు వెళ్లి వృద్ధులు వ్యయప్రయాసలు పొందే ఇబ్బంది లేకుండా గ్రామస్థాయిలోనే వైద్యసేవలు అందించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆయా తేదీలను పీహెచ్‌సీలకు తెలియజేస్తాం. ప్రజలంతా ప్రభుత్వం అందించే ఈ సూపర్‌ సేవలను వినియోగించుకోవాలని డిఎంహెచ్‌వో సూర్యనారాయణ కోరారు.


ఇంటింటా సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బంది :
డిజిటల్‌ సేవల అమల్లో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే విశాఖ జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఉన్న గ్రామాల్లో సచివాలయ, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో 20 ఏళ్లు వయస్సు దాటిన వారి నుంచి 60 ఏళ్లు వయస్సు ఉన్న వారి అనారోగ్య వివరాలు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు, ఇతర అనారోగ్య సమస్యలు తదితర వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న రోగుల వివరాలు, సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌, ఇతర ఆనారోగ్య వివరాలను సేకరించి ఆయా వివరాలను ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా డిజిటల్‌ ఐడి క్రియేట్‌ చేసి వాటి ద్వారా నమోదు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ తెలిపారు.
డిజిటల్‌ ఐడితో సేవలు సులభతరం : డిఎంహెచ్‌వో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగంలో తీసుకువస్తున్న ఈ నూతన డిజిటల్‌ సేవలతో రోగులకు ఇక సత్వర వైద్యసేవలందనున్నాయి. ప్రతి రోగి వారి అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఫైళ్లు భారం లేకుండా ప్రతి వివరాలు ఇక ఆన్‌లైన్‌లో పొందుపర్చే అవకాశం ఉండటంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. రోగికి కేటాయించిన ప్రత్యేక డిజిటల్‌ ఐడితో దేశంలో ఎక్కడికెళ్ళినా వారికి కేటాయించిన ఐడి నెంబర్‌ ఎంటర్‌ చేయగానే సంబంధిత రోగుల వివరాలు పూర్తిస్ధాయిలో కనిపిస్తాయి. దీనివల్ల వైద్యసేవలు సులభతరం కానున్నయిని డిఎంహెచ్‌వో డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement