అమరావతి, ఆంధ్రప్రభ: డిజిటల్ యుగం వైపు దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వైద్య ఆరోగ్య రంగం కూడా ఆదిశగా అడుగులు వేస్తోంది. ఆశించిన మేర డిజిటల్ సమాచారం అందుబాటులో వుంటేనే ఏ రంగంలోనైనా పరిశోధన చేసేందుకు వీలవుతుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా సమర్థవంతమైన వైద్య వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రయిల్ రన్ విజయవంతం కాగా వచ్చే ఏడాది ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నారు. ఈక్రమంలో ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి డిజిటలైజ్ చేయటం వల్ల వైద్య కేంద్రాలను సందర్శించినపుడు సరైన వైద్య చికిత్స అందచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే 80 శాతం అభా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికాగా డిసెంబర్ నెలఖరు నాటికి నూరుశాతం పూర్తచేయాలన్నది వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ఏపీలో దాదాపు 3.5 కోట్ల అభా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 2.62 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఒక్కొకరు 50 ఇళ్లకు చొప్పున జవాబుదారీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్య సేవలందిస్తున్న – ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారంతో ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలిగారు. ప్రజారోగ్య పరిరక్షణలో డిజిటల్ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు ఆరు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అత్యధిక హెల్త్ రికార్డులను అనుసంధానించిన బాపట్ల, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలతో 1, 2, 3 స్థానాలలో నిలిచాయి. ప్రజారోగ్యవసతులను నూరు శాతం రిజిస్ట్రేష్రన్ చేసినందుకు, హెల్త్ రికార్డులను సమీకృతం చేయటంలో ప్రభుత్వం అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్రం ఈ అవార్డుల్ని అందించింది.
సమగ్ర సమాచారం
ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల ఫ్యామిలీ డాక్టర్లకు సమగ్ర సమాచారం అందే వీలుంటుంది. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ల విధానం అమలయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పిహెచ్ సిలో వున్న ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని మ్యాపింగ్ చేయటం జరుగుతుంది. వారు తమకు నిర్దేశించిన గ్రామాలను సందర్శించి అక్కడ వైద్య సేవలందిస్తారన్నారు. ఒక వైద్యుడు ఎంఎంయులో గ్రామాలను సందర్శించి వైద్యసేవలందిస్తుంటే మరొకరు పిహెచ్ సికి వచ్చే వారికి వైద్య సేవలందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాపింగ్ చేసిన గ్రామాల్లో వైద్యులు శాశ్వత ప్రాతిపదికపై నెలలో రెండు రోజులు సేవలు అందించనున్నారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్‌లు ఒక గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందించారు.
వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ లోని ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రామంలోని గర్భస్థ మహిళలు, బాలింతలు, పాలిచ్చే తల్లుల వంటి వారితో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారి జాబితా ను వైద్యాధికారి పర్యటనకు ముందు రోజే సిద్ధం చేస్తారు. మండలానికి రెండు పిహెచ్ సిలు, పిహెచ్ సికి ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు అందుబాటు-లో వుంటారు. సగటు-న ఒక్కొక్కరికీ ఐదు లేదా ఆరు గ్రామాలను కేటాయించనున్నారు. గ్రామ స్థాయిలో -టె-లి మెడిసిన్ సేవలను మెరుగుపర్చనున్నారు. 6500 టెలి మెడిసిన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వారు అక్కడి వైద్యులను, తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హబ్ లో వున్న స్పెషలిస్టు వైద్యులను సంప్రదించి సలహా సూచనలందుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్‌ఎంలు వారిని వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఎంపానెల్డ్ ఆస్పత్రులకు రిఫర్ చేసి అక్కడికి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని అమలు చేయడం ద్వారా 80 శాతం మేర ఆరోగ్య సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారమందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా జిల్లాస్థాయి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించి నాణ్యమైన వైద్యం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వున్న 6,313 సబ్ సెంటర్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 3719 విలేజ్ హెల్త్ క్లినిక్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల సంఖ్య మొత్తం 10032కు చేరింది.
ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేందుకు వీలుగా 42,752 మందిసుశిక్షితులైన ఆశా వర్కర్లను సిద్ధం చేశారు. వీరు ప్రజల ప్రాథమిక కుటు-ంబ ఆరోగ్య అవసరాలను అంచనా వేసి కమ్యూనిటీ-, ఆరోగ్య కేంద్రాలకు వారిని అనుసంధానిస్తారు. డాక్టర్ వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో 14 రకాల రాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లను కూడా అందుబాటు-లో ఉంచారు. – 67 రకాల మందులను ప్యాక్ చేసి మూడు నెలల క్రితమే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు పంపారు. గ్రామీణుల ఆరోగ్యానికి సంబంధించి భవిష్యత్‌లో పీహెచ్‌సీ డాక్టరే బాధ్యత వహించేలా ఈ విధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంఎంయులతో -టైఅప్ చేసి ప్రతి నెలా మందులు అందుబాటు-లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు.
గ్రామీణ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా ఈ విధానం ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీలలో పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందుతుందో లేదో కూడా వైద్యాధికారి నేతృత్వంలోని బృందం పరిశీలన చేయనుంది. దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.