Tuesday, November 19, 2024

AP | కౌలు రైతులకు కష్టాలు.. సాగుదారులకు దక్కని హక్కులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంతోనే కౌలు రైతులకు కష్టాలకు కూడా మొదలయ్యాయి. సేద్యం పెనుభారంగా మారిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రైతాంగానికి ఎంతోకొంత ఊరటనిస్తుండగా కౌలు రైతులకు మాత్రం వాటిని అందుకునే అవకాశం కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ) విధానాన్ని రూపొందించినా ఆచరణలో దాని అమలు అంతంతమాత్రంగానే ఉంది.

కౌలు రైతుల సంఖ్యకూ, సీసీఆర్సీ కార్డులు అందుకున్న వారి సంఖ్యకు పొంతనే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు సీసీఆర్సీలు అందించటం ప్రభుత్వానికి కూడా సవాల్‌ మారింది. క్షేత్రస్థాయిలో భూమి యజమానులు సహకరించకపోవటమే దీనికి ప్రధాన కారణం. సీసీఆర్సీల కోసం పట్టుబడితే అసలుకే ఎసరొచ్చి భూమిని కౌలుకు ఇవ్వరేమోనన్న భయం కూడా వెంటాడుతోంది.

కౌలు రైతులకు సీసీఆర్సీలు ఇచ్చేలా భూమి యజమానులకు అవగాహన కలిగించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన ప్రణాళికను అమలు చేయలేకపోవటం కూడా దీనికి ప్రధాన కారణం. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన ప్రయోజనాలన్నిటినీ కౌలు రైతులు కోల్పోతున్నారు.

ప్రకృతి విపత్తులతో పాటు ఇతర కారణాలు వల్ల పంట నష్టపోయినప్పుడు కౌలు రైతులు ప్రభుత్వ సహాయ, సహకారాలకు నోచుకోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు భరోసా లాంటి పథకాలకు కూడా వారు నోచుకోవటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 75 శాతం కౌలు రైతులు ఉన్నట్టు గతంలో స్వచ్ఛంధ సంస్థలు, రైతు సంఘాలు ప్రకటించాయి.

సాగు వ్యయం భారీగా పెరగటంతో పాటు భూమి యజమానికి లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలు చెల్లించాల్సి రావటం, వడ్డీ లేని పంట రుణాలు, రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం తదితర పథకాల లబ్దిదారుల జాబితాలో కౌలు రైతులు లేకుండా పోవటం..అనివార్యంగా ప్రయివేట్‌ వ్యక్తులవద్ద నుంచి అధికవడ్డీకి నగదు తీసుకుని సాగు చేయాల్సిన పరిస్థితులు కౌలు రైతులను సంక్షౌభంలోకి నెట్టివేశాయని నెట్టేస్తున్నాయని కౌలు రైతు సంఘాలు చెబుతున్నాయి.

- Advertisement -

27.15 లక్షల హెక్టార్లలో కౌలు సాగు

రాష్ట్రంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అమల్లో ఉన్న ఏపీ భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో పంట సాగుదారుల హక్కు చట్టాన్నితీసుకువచ్చింది. సాగు దారుల హక్కు చట్టం అమలయ్యాక ఏపీ సుస్థిర వ్యవసాయ అభివృద్ది కమిషన్‌ రాష్ట్రంలో 24.25 లక్షల మంది కౌలు రైతులున్నట్టు గుర్తించింది.

వీరిలో 6.19 లక్షల మందికి అసలు భూమి లేదనీ, 18.03 లక్షల మంది కొంత సొంత భూమి ఉండి మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్టు గుర్తించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని 60.73 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో 27.15 లక్షల హెక్టార్లు.. అంటే 44 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్టు వెల్లడించింది.

ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు సుమారు 16 లక్షల మంది కౌలు రైతులను మాత్రమే గుర్తించింది. కౌలు రైతు అత్యధికంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నారు. పశ్చిమ గోదావరిలో అత్యధికంగా 3,55,716 మంది కౌలు రైతులుండగా తూర్పుగోదావరిలో 2,43,742, కృష్ణాలో 1,96,372, గుంటూరులో 1,61,338, ప్రకాశంలో 1,20,146 మంది కౌలు రైతులున్నారు.

ఇప్పటివరకు 26 శాతమే..

ప్రభుత్వం అందించే లెక్కలు ఎలా ఉన్నా కౌలు రైతుల్లో ఇప్పటివరకు 26 శాతం మంది మాత్రమే సీసీఆర్సీ కార్డులు అందుకున్నట్టు అంచనా. శ్రీకాకుళంలో 6 శాతం, విజయనగరంలో 17 శాతం, విశాఖపట్టణంలో 18 శాతం, తూర్పుగోదావరిలో 46 శాతం, పశ్చిమ గోదావరిలో 31 శాతం, కృష్ణాలో 39 శాతం, గుంటూరులో 33, ప్రకాశంలో 15 శాతం, నెల్లూరులో 5 శాతం, చిత్తూరులో 1 శాతం, కడప జిల్లాలో 14 శాతం, అనంతపురంలో 2 శాతం, కర్నూలులో 39 శాతం మంది సీసీఆర్సీ కార్డులు అందుకున్నట్టు సమాచారం.

మిగతా 74 శాతం మంది కౌలు రైతులకు సీసీఆర్సీకార్డులు ఇచ్చేందుకు చేసే ప్రయత్నాలు వివిధ దశల్లో ఆగిపోతున్నాయి. ప్రత్యేకించి 11 నెలల కాలానికి కౌలు తీసుకున్నట్టు భూ యజమానులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంది. దానికి రైతులెవరూ అంగీకరించకపోవటంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కౌలురైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందేలా రానున్న ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement