Friday, November 22, 2024

మల్లన్న భక్తులకు కష్టాలు తప్పేనా.. పాదయాత్ర సవ్వంగా సాగేనా? మహాశివరాత్రికి మందకొడిగా ఏర్పాట్లు..

కర్నూలు (ప్రభ న్యూస్‌) : శ్రీశైలం మల్లన్న శరణన్నచాలు.. పరమపాతక కోట్లు భస్మమైతూలు.. అని శ్రీశైల ప్రశస్తి. శ్రీ పర్వతం లేదా శ్రీశైలం అంటే కైలాసనాథునికి పరమ ప్రీతి. ఇక తెలుగువారికి శివుడంటే ఉన్నభక్తి చెప్పనవసరం లేదు. త్రిలింగాల వలె తెలుగు పదం ఉద్భవించిందన్నది నానుడి, అందుకే శివాలయం లేని ఊరు కనిపించదు. శివాలయాల్లో విశిష్టమైన, మహత్తు గల క్షేత్రం శ్రీశైలం, ఈ క్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా రమణీయ, భక్తి భావతరంగిత చిత్రంను ఆవిష్కరిస్తుంది. సర్వం శివ మయంగా కనిపించే ఈ క్షేత్రంను మహా శివరాత్రి సందర్బంగా దర్శించడమే మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్టత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అసక్తి కనబరుస్తారు.

ఈనెల 22 నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు..

దక్షిణాది ఆలయాల్లో మహాక్షేత్రంగా పేరుపొందిన భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 22 నుంచి మార్చి 4వ తేది వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఒక్క శివరాత్రి సందర్భంగానే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. రెండేళ్లుగా మహమ్మారి కరోనా శ్రీశైల ఆలయ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది. కాగా, ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గు ముఖం పట్టడంతో మహా శివరాత్రి సంద‌ర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు, పాలకులు వెల్లడిస్తున్నా అనుకున్నంతగా కనిపించడం లేదు. వసతులు కల్పన విషయంలో ఏటేటా నిధులు వ్యయం చేస్తున్న భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఏటా సమస్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్బంగా కర్నూలు జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మల్లన్నను దర్శించుకునేందకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వీరికోసం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, భక్తులు స్నానమాచరించేందుకు ఏర్పాట్లు, దుస్తుల మార్పిడి గదులు, వసతి గృహలు, వాహనాల పార్కింగ్‌, ఇతర వసతులు కల్పించాలి. అయితే కొంతకాలంగా శ్రీశైలంలో భక్తులకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వసతులు లేవు. ఒక్క మహాశివరాత్రి సందర్బంగానే దాదాపు 4 లక్షల మంది భక్తులు ఏటా వస్తున్నా దానికి త‌గ్గ ఏర్పాట్లు చేయ‌డం లేదు. ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు, ఇతర త్ర వసతి సౌకర్యాలతో పోల్చకుంటే లక్షకు మించి లేవు. దీంతో ఏటా శ్రీశైలం వచ్చే భక్తులు చాల వరకు రోడ్లపైనో, ఏ చెట్ల కిందనో బస చేయాల్సి వ‌స్తోంది.

నల్లమల ఘాట్‌రోడ్డులో అన్ని ఇబ్బందులే..

శ్రీశైల ఆలయానికి చేరుకోవాలంటే ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు నల్లమల అటవిలో ప్రయాణం సాగించాలి. కర్నూలు నుంచి శ్రీశైలంకు మధ్య దూరం 180 కి.మీ కాగా, ఇందులో ఆత్మకూరు నుంచి శ్రీశైలంకు 110 కి.మీ, ఇక ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు పూర్తి ఘాట్‌ సెక్షన్‌ ఉంది. దొర్నాల నుంచి శ్రీశైలం వెళ్లాలంటే దాదాపు 50 కి.మీ వరకు ఉంటుంది. ఇందులో ఆత్మకూరు బైర్లూటీ నుంచి పెద్ద దొర్నాల వరకు అటవీలో సింగిల్‌ రోడ్డుపై ప్రయాణించాలి. అయితే ఈ రహదారిలో ప్రయాణం చేయడం చాలా క‌ష్టం. ఎదురుగా వాహనం వస్తే మరో వాహనం రోడ్డుసైడ్‌కు దిగాల్సి ఉంటుంది. అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఆ పూట అటవీలో ఉండాల్సిందే. ఈ క్రమంలో మహిళలు, వృద్ధులు, పిల్లల బాధలు వర్ణాతీతంగా ఉంటాయి. ముఖ్యంగా బైర్లూ టీ దాటిన తర్వాత రోళ్లపాడు నుంచి ప్రకాశం జిల్లాలోని కొర్రపోలూరు వరకు మొత్తం ఘాట్‌ సెక్షన్‌లో వాహానాలు ప్రయాణించాలి.

- Advertisement -

కాలిబాటకు తప్పని ఇబ్బందులు..

శ్రీశైలంకు వెళ్లే భక్తులు చాలా వరకు నల్లమల అడవిలో కాలిబాటన వెళ్లడం అనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో కాలిబాటన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులపై ఉంది. కాలిబాటన వెళ్లే భక్తులలో అధికంగా ఆత్మకూరు పరిధిలో వెంకటాపురం గ్రామం నుంచి నడక మొదలెట్టి నాగలూటి, దామర్లకుంట, పెచ్చేర్వు, మఠం బావి, కైలాస ద్వారం మీదుగా శ్రీశైలంకు చేరుకుంటారు. మార్గ మధ్యలో అటవీలో అనేక ఇబ్బందులు ఏటా భక్తులు చవిచూస్తున్నారు. ముఖ్యంగా కాలిబాటన వెళ్లే మార్గంలో ఆలయ అధికారులు, అటవీ అధికారుల సమన్వయంతో జంగిల్‌ క్లియర్‌ చేయాలి. ఇందుకు అటవీశాఖకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇచ్చిన నిధులను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసేలా దృష్టి సారించాలి. లేని పక్షంలో నిధులు పక్కదారిపట్టే అసంపూర్తిగా పనులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కాలిబాటన వెళ్లే మార్గంలో భక్తులకు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. వెంకటాపురం నుంచి నాగలూటీ, దామర్ధ కుంట, పెచ్చేర్వు వరకు భక్తులకు ఆహార సమస్య లేకుండా దాతలు ఏర్పాట్లు గావిస్తుండగా, మంచినీటికి ఇబ్బందులున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement