విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ఇండిగో ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72-600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.
విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ విమాన సర్వీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల్లోనే చేరుకోవచ్చని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.