Saturday, November 23, 2024

రాష్ట్ర ఆర్థిక గణాంకాలలో తేడాలు, అసంపూర్తిగా లెక్క‌లు.. వివరణ కోరిన కాగ్‌

అమరావతి,ఆంధ్రప్రభ : రాష్ట్రానికి సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సర గణాంకాలను కాగ్‌ ప్రకటించింది. జూన్‌ నెలలో ప్రాథమిక గణాంకాలను ప్రకటించిన కాగ్‌ తాజాగా సవరణ గణాంకాలను ప్రకటించడం గమనార్హం. అయితే ఈ గణాంకాలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రాథమిక, సప్లిమెంటరీ గణాంక నివేదికల మధ్య పెద్దగా తేడాలు లేకపోవడం గమనార్హం. ప్రాథమిక గణాంకాల్లో మొత్తం ఆదాయాన్ని రూ.1,77,853 కోట్లుగా చూపించగా, తాజా గణాంకాల్లో రూ.1,77,674 కోట్లుగా చూపించారు. అంటే ఆదాయం స్వల్పంగా తగ్గినట్టయింది. అలాగే మొత్తం వ్యయాన్ని తొలి నివేదికలో రూ.1,75,714 కోట్లుగా చూపించగా, తాజా నివేదికలో రూ.1,75,536 కోట్లుగా చూపించారు. అంటే వ్యయం కూడా స్వల్పంగా తగ్గింది.

ఇక ఆదాయ లోటును తొలి నివేదికలో రూ.8,370 కోట్లుగా చూపించగా, కొత్త నివేదికలో రూ.8,611 కోట్లుగా చూపించారు. అంటే కొద్దిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ద్రవ్య లోటు కూడా తొలి నివేదికలో రూ.25,194 కోట్లుగా చూపించగా, తాజా నివేదికలో రూ.25,013 కోట్లుగా చూపించారు. అంటే 180 కోట్ల వరకు తగ్గినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, ఇతర రంగాల్లో కూడా ఇదే తరహాలో స్వల్ప తేడాలు మాత్రమే రికార్డయ్యాయి. తొలి నివేదికలో రాష్ట్రం సమర్పించిన వివరాలపై సర్వత్రా విమర్శలు వచ్చినప్పటికీ, తుది నివేదికలో కూడా అదే తరహా గణాంకాలు నమోదు కావడం గమనార్హం. పెట్టుబడి వ్యయం, రెవెన్యూ వ్యయ, సబ్సిడీలు, జీతాలు, పింఛన్లు, చెల్లించిన వడ్డీలు వంటి రంగాల్లో కూడా స్వల్ప తేడాలు మాత్రమే ఉండడం గమనార్హం. గత నివేదిక సమయంలో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల వివరాలు, రుణాలకు సంబంధించిన వివరాలు కాగ్‌కు చేరలేదు. ఇదే అంశాన్ని సప్లిమెంట్‌ నివేదికలో మరోసారి కాగ్‌ స్పష్టం చేసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement