Monday, November 18, 2024

ఏపీలో డీజిల్‌ కొరత.. మరో పది రోజులు ఇంతేనంటున్న‌ డీలర్లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డీజిల్‌ కొరత అటు రవాణా రంగాన్ని ఇటు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అటు వాహనదారులు, ఇటు రైతులు పెట్రోల్‌ బంకుల వద్ద డీజిల్‌ కోసం బారులు తీరుతున్నారు. అనేకచోట్ల నో స్టాక్‌ బోర్డులు దర్శనిమిస్తుండటంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలుగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధికెక్కాయి. ఏపీలో ముందస్తు ఖరీఫ్‌ సాగు కోసం ఇప్పటికే ప్రభుత్వం కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసింది. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతీ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కూడా పడుతున్నాయి.

ఈనేపథ్యంలోనే రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. అదే సమయంలో వ్యవసాయ పనులకు నిత్యం వాడే ట్రాక్టర్లు, ఏటి మోటార్లకు డీజిల్‌ తప్పనిసరిగా మారింది. దీంతో రైతులు ఒక్కసారిగా పెట్రోల్‌ బంక్‌ల వద్ద బారులు తీరారు. అసలే బంకుల్లో డీజిల్‌ కొరత ఉండటం, మరోవైపు పెద్ద పెద్ద సంస్థలు కూడా బహిరంగ మార్కెట్‌లో డీజిల్‌ కొనుగోలు చేస్తుండటం వంటి కారణంగా రైతుకు డీజిల్‌ అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పంట సాగుకు అదునుపోతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

డీజిల్‌ కొరత ఎందుకు ?

- Advertisement -

రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3,500 పెట్రోల్‌ బంకులున్నాయి. వీటి ద్వారా రోజుకు ఏడు లక్షల లీటర్ల మేర డీజిల్‌, నాలుగు లక్షల లీటర్ల మేర పెట్రోల్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే, రోజువారీ సరఫరాలో ఆయిల్‌ కంపెనీలు కోత విధిస్తున్నాయి. డీజిల్‌పై లీటరుకు రూ. 25 నుండి రూ. 30 వరకూ తమకు లాస్‌ వస్తోందని, ఆకరణంగానే డీజిల్‌ సరఫరాలో కోత విధించాల్సి వస్తోందని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయని పెట్రోల్‌ బంకు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, పెట్రోల్‌పై సరఫరాలో ఎటువంటి కొరత లేదని అంటున్నారు.

తాము లోడ్‌ కోసం మూడు రోజుల ముందే డీడీ రూపంలో డబ్బు చెల్లిస్తున్నామని, అయినా కూడా తమకు బంకుకు 5 వేల లీటర్ల చొప్పున మాత్రమే డీజిల్‌ సరఫరా చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ఒక లోడు డీజిల్‌ను రెండు బంకులకు కలిపి పంపుతున్నారని అంటున్నారు. తెచ్చిన 5 వేల లీటర్లు కొన్ని గంటల్లోనే అయిపోతోందని, తిరిగి డీజిల్‌ కొరకు డీడీ కట్టాలంటే పెట్రోల్‌, డీజిల్‌ రెండూ కలిపి కడితేనే పంపుతామని ఆయిల్‌ కంపెనీలు మొండికేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్‌ కొరతపై రష్యా ఉక్రెయిన్‌ ప్రభావం ఫలితం పడిందని నిపుణులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement