తుగ్గలి, ప్రభన్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తికి వజ్రం దొరికింది. తుగ్గలి మండలం పగిడిరాయిలో వారం క్రితం పొలం పనులకు వెళ్లిన ఓ కూలీకి ఈ వజ్రం లభించినట్లు తెలిసింది. అయితే స్థానికంగా ఉన్న డైమండ్ వ్యాపారి దీన్ని రూ.45 వేలకు అమ్మినట్టు తెలుస్తోంది. అంతేకాదు గత మే 27న కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో అత్యంత విలువైన వజ్రాలు రైతులకు దొరికినట్లు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో వజ్రాలు లభ్యమవుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్నజొన్నగిరిలో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనులు చేస్తున్న రైతుకు వజ్రం లభ్యమైనట్లు సమాచారం.
అయితే ఈ వజ్రాన్ని రహస్యంగా టెండర్ వేశారు. ఈ వజ్రాన్ని రూ.కోటి 25 లక్షలకు గుత్తికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అది బహిరంగ మార్కెట్‌లో రూ. 3కోట్లకు పైగా విలువ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అదేవిధంగా జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొప్పాయి తోటలో కలుపు తీస్తున్న మహిళా కూలీకి ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేశారు. అదే విధంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలీకి ఓ వజ్రం లభించింది.
పెరవలికి చెందిన వ్యాపారికి రూ.40 వేలకు విక్రయించినట్లు- సమాచారం.జిల్లా వాసులే కాదు అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి అన్వేషణ సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేస్తుంటారు.